డ్రైవర్ లేని మెట్రో రైల్ ప్రారంభించిన మోడీ

Modi flags off India’s first-ever driverless metro train మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును సోమవారం(డిసెంబర్-28,2020) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ మెట్రోలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతోపాటు నేషనల్ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం కావడం చూస్తే ఆధునికత వినియోగంలో భారత్ ఎంత వేగం కనబరుస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో తొలి మెట్రో రైలు.. వాజ్‌పేయీ కృషి వల్ల ప్రారంభమైందని గుర్తుచేశారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 5 నగరాల్లోనే మెట్రో సేవలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు 18 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలను విస్తరిస్తామని ప్రధాని మోడీ తెలిపారు.
నగరీకరణ సవాల్ గా కాకుండా అవసరంగా భావిస్తున్నామని మోడీ చెప్పారు. ఢిల్లీ.. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న దేశానికి రాజధానిగా ఉన్నదని మోడీ అన్నారు. ఈ ప్రతిష్ఠ ఇక్కడ ప్రతిబింబించాలని చెప్పారు. మనందరం కలిసి పనిచేస్తే ప్రజల జీవితాలు మెరుగుపడుతాయని, నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కాగా, ఈ డ్రైవర్ లేని రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. కమాండ్ సెంటర్ల ద్వారా డ్రైవర్ లెస్ రైలు నియంత్రణ జరుగుతుంది. ఈ మెట్రో రైలులో హై రిజల్యూషన్ కెమెరాలు, రిమోట్ హ్యాండ్లింగ్, రియల్ టైమ్ మానిటరింగ్ రైలు పరికరాలతో అత్యవసర అలారం మరియు హైటెక్ సౌకర్యాలు ఉంటాయి.
డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయని ఢిల్లీ మెట్రో తెలిపింది.కొత్త తరం రైళ్లను ప్రారంభించటం ద్వారా ఢిల్లీ మెట్రో.. 7 శాతం ప్రపంచ మెట్రో నెట్‌వర్క్‌లో చేరిందని.. నూతన ఆవిష్కరణల ద్వారా ఢిల్లీ ప్రజలకు, దేశ రాజధాని ప్రాంతంలోని ఇతర నగర వాసులకు ప్రయాణ సదుపాయాలు,విస్తరణకు సంబంధించి కొత్త శకం ఆరంభం కానుందని ఢిల్లీ మెట్రో ప్రకటించింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్ పార్క్ నుంచి శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్ లేని మెట్రో సేవలు మొదలవుతాయని ఢిల్లీ మెట్రో తెలిపింది.
మరోవైపు, ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(ఎన్‌సీఎంసీ)ను ఇవాళ ప్రారంభించారు మోడీ. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో భాగంగా న్యూ ఢిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ 21 వరకు ఉన్న 23 కి.మీ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్‌సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. వన్ నేషన్-వన్ కార్డ్ నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోడీ ప్రారంభించారు.