కోవిడ్ హాస్పిటల్స్ లో సేవలందించేందుకు రిటైర్డ్ ఆర్మీ వైద్య సిబ్బంది రెడీ

కోవిడ్ హాస్పిటల్స్ లో సేవలందించేందుకు రిటైర్డ్ ఆర్మీ వైద్య సిబ్బంది రెడీ

Pm Modi Reviews Covid Situation With Cds Rawat Medical Personnel Retired In Last 2 Years Recalled

Updated On : April 26, 2021 / 8:13 PM IST

CDS Rawat కొవిడ్​ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో భద్రతా దళాల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ సిబ్బంది సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

దేశంలో ప్రస్తుత పరిస్థితులపై సోమవారం త్రివిధ దళాధిపతి(CDS)జనరల్ బిపిన్ రావత్ తో ప్రధాని మోడీ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్‌ కట్టడికి ఆర్మీ చేపడుతున్న చర్యల గురించి రావత్​ను అడిగి తెలుసుకున్నారు మోడీ. విదేశాల నుంచి ఆక్సిజన్, ఔషధాల సరఫరాకు వైమానిక దళం చేస్తున్న చర్యలను బిపిన్‌ రావత్‌ ప్రధానికి వివరించారు. విస్తృత స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సైన్యం కృషి చేస్తున్నట్లు ప్రధానికి తెలిపిన రావత్‌.. సాధ్యమైనంత మేర ఆర్మీ వైద్య సదుపాయాలను పౌరులకు కల్పిస్తున్నట్లు చెప్పారు.

సాయుధ దళాల్లో గడిచిన రెండేళ్లలో పదవి విరమణ పొందిన మెడికల్ సిబ్బంది సేవలను వివిధ ఆసుపత్రుల్లో వినియోగించుకునేలా చూస్తామని జనరల్ బిపిన్ రావత్ ప్రధానికి తెలిపారు. వీరి వీరి నివాస ప్రాంతాలకు సమీపంలోని ఆసుపత్రుల్లో వీరు పని చేసేలా చూస్తామని, అనేకమంది ఇందుకు ఉత్సాహం చూపుతున్నారని రావత్ మోడీకి చెప్పారు. ముందే పదవీ విరమణ చేసినవారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కమాండ్ హెడ్ క్వార్ట్రర్స్, కార్స్ హెడ్ క్వార్ట్రర్స్, డివిజన్, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్ట్రర్స్ లో పని చేసే వైద్య సిబ్బందిని సైతం కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. రక్షణ శాఖ హాస్పిటల్స్ లో డాక్టర్లకు సాయం కోసం అదనపు నర్సింగ్ అధికారుల నియామకాలను చేపట్టినట్టు రావత్ తెలిపారు. అలాగే వివిధ రక్షణ శాఖ విభాగాల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు తరలించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.