మోడీ రైతుబంధు : ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు రైతాంగంపై మోడీ కన్ను పడింది. అన్నదాతలను ప్రసన్నం చేసుకునేందకు మోడీ స్కీం తీసుకురాబోతున్నారు. అదే రైతు బంధు.
తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన రైతు బంధు పథకం తరహాలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతు సంక్షేమ పథకం ఒకటి అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు వివిధ రకాలుగా చెల్లించే సబ్సిడీలను ఎత్తివేసి.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదుని బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం రూ.70వేల కోట్లను కేటాయించినట్లు తెలుస్తొంది. ఆ డబ్బును ఇక నుంచి నేరుగా .. రైతు బంధు పథకం తరహాలో ఇవ్వనున్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసే స్కీమ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇస్తున్నారు. వాటన్నింటిని ఒక్కటి చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి డీఎస్ మాలిక్ మాత్రం ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు వార్తలొచ్చాయి. 2019 మే లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పొగొట్టాలంటే ఈ భారీ స్కీమ్‌ను కూడా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. మరి మోడీ వ్యూహం ఏ మేరక ఫలిస్తుందో, బీజేపీకి ఎన్ని ఓట్లు రాలుస్తుందో చూడాలి.