PM Modi: కాంగ్రెస్ విభజించి పాలించింది: ప్రతిపక్షలపై ప్రధాని మండిపాటు
దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు.

Modi
PM Modi: దేశంలో కాంగ్రెస్ పార్టీ “విభజించు పాలించు” విధానంతో రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం వర్చువల్ విధానంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మణిపూర్ ను దోచుకుతిన్న కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు. ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ “కాంగ్రెస్ రాష్ట్రంలో అభివృద్ధిని కోరుకోలేదని..రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ప్రయత్నించిందని, ఈవిషయాన్ని మణిపూర్ ప్రజలు గుర్తించాలని” అన్నారు. బీజేపీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్న మోదీ.. ప్రత్యేకించి మణిపూర్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి.. రాష్ట్రాన్ని విడగొట్టాలన్న ప్రతిపక్షాల ఆలోచనలకూ కళ్లెం వేసినట్లైందని మోదీ అన్నారు.
Also read: Kolkata: కోల్‌కతా బాగా రిచ్ గురూ.. 257మంది దగ్గర రూ.226కోట్లకు పైగా సంపద
తన ప్రసంగం సందర్భంగా మణిపూర్ లో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో ఆటల్లోనూ దూసుకుపోతున్న మణిపూర్లో.. స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రతిభ, స్పోర్ట్స్, స్టార్టప్ లలో మణిపూర్ మంచి ఫలితాలు కనబరిచిందని.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో స్టార్టప్ లను మరింత ముందుకు నడిపించేలా రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు మోదీ తెలిపారు.
Also read: Telangana : మహిళల గురించి మాట్లాడే అర్హత బీజేపి నేతలకు లేదు : మంత్రి హరీశ్ రావు
స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్ల పాటు రైలు సౌకర్యం కోసం ఎదురు చూసిన మణిపూర్ ప్రజల ఆకాంక్షను బీజేపీ నెరవేర్చిందని మోదీ అన్నారు. మరిన్ని రైలు ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి తేనున్నట్లు మోదీ వివరించారు. కాంగ్రెస్ హయంలో ఈశాన్య రాష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని.. బీజేపీ అధికారంలోకి వచ్చాకే వారిని అక్కున చేర్చుకుని చేరదీశామని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశ ఐకమత్యానికి ప్రతీకగా ఈశాన్య రాష్ట్రాలు నిలుస్తున్నాయని మోదీ అన్నారు.