మోడీ వీడియో కాన్ఫరెన్స్ : సీఎంలు ఏం చెబుతారో
లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు.

లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ 30 రోజులు దాటింది. మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు పీఎం మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయినా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ? తెలుసుకొనేందుకు పీఎం మోడీ..రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ విధించిన అనంతరం పలుమార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 20, ఏప్రిల్ 11వ తేదీల్లో ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో వారం రోజుల్లో లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో పీఎం నిర్వహిస్తున్న ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
మే 03 తర్వాత..లాక్ డౌన్ ఎత్తివేయడమా ? దశల వారీగా సడలింపు ఇవ్వడమా ? అనే విషయంపై చర్చించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తారని సమాచారం. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఎన్నో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నది. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు పీఎం. ఇప్పటికే కేంద్రం, పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కు పలు రంగాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని, ఇందుకు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులే నిదర్శనమని, ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేయడం అంత క్షేమం కాదని..కొనసాగించాలని మెజార్టీ రాష్ట్రాల సీఎంలు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీని అడిగే అవకాశం ఉందని సమాచారం. ఎఫ్ఆర్ బీఎంకు సవరణలు కూడా అడిగే అవకాశం ఉంది. మరి సీఎంల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత..పీఎం మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.