ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతా…PMC బ్యాంకు ఖాతాదారులకు నిర్మలా భరోసా

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పీఎంసీ ఖాతాదారులను ఉద్దేశించి నిర్మల మాట్లాడుతూ తానుఆర్బీఐ గవర్నర్‌తోమాట్లాడతానని, ఖాతాదారులు తమ సొమ్ము తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతానని చెప్పారు.
నిర్మల సీతారామన్ గురువారం మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సంబంధించి విలేకర్ల సమావేశంలో మాట్లాడవలసి ఉంది. ఈ సమయంలో పీఎంసీ బ్యాంక్ ఖాతాదారులు బీజేపీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆమె విలేకర్ల సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేసి, ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఖాతాదారుల సమస్యను అత్యవసరంగా పరిష్కరించవలసి ఉందని తాను ఆర్బీఐ గవర్నర్కు చెబుతానన్నారు. ఖాతాదారులు ఈ బ్యాంకులో జమ చేసిన సొమ్మును తిరిగి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
పీఎంసీ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. తన ఆస్తుల విలువ రూ.9,000 కోట్లలో 70 శాతానికి పైగా HDIL అనే రియాలిటీ సంస్థకు రుణం ఇచ్చింది. దీన్ని తిరిగి రాబట్టుకోవడంలో విఫలమైంది. ఈ రియాలిటీ సంస్థ దివాలా దిశగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్బీఐ ఈ బ్యాంకుపై ఆంక్షలు విదించింది. ఖాతాదారుల డిపాజిట్ల ఉపసంహరణ పరిమితిని రూ.25,000గా నిర్ణయించింది. రాబోయే ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. అయితే విత్‌డ్రాయల్ పరిమితిని రూ.25 వేలకు పెంచినప్పటికీ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం ప్రభుత్వం రూ.16,000 కోట్లు ఇవ్వగలిగినపుడు, పీఎంసీకి ఉద్దీపన ప్యాకేజి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకునే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కస్టమర్లు బుధవారం ముంబైలోని ఎస్‌ప్లనేడ్ కోర్టు ముందు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. పీఎంసీ బ్యాంకులో సుమారు 4వేల కోట్ల కుంభకోణం జరిగింది. పీఎంసీ బ్యాంకు డైరక్టర్లను ఇటీవల ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కుంభకోణానికి పాల్పడ్డవారికి బెయిల్ ఇవ్వకూడదని, వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ప్లనేడ్ కోర్టు ముందు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
పీఎంసీ బ్యాంకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర రిజిస్టర్ కాలేదు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చట్టంలో సవరణలు తేవడానికి సీతారామన్ ప్రయత్నిస్తున్నారు. ఈ బ్యాంకు రిజిస్టర్ కాకపోవడానికి కారణాలను వివరంగా తెలుసుకోవాలని తన మంత్రిత్వ శాఖలోని కార్యదర్శులను నిర్మల కోరారు.