వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? 12 రోజులుగా సమాచారం లేదు. ప్రభుత్వానికి కుటుంబసభ్యుల లేఖ

వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా ఆయన ఆరోగ్య సమాచారం తెలియడం లేదని, కరోనాకు సంబంధించిన చికిత్స విషయం తెలియడం లేదని వెల్లడించారు.
ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ కు లేఖ రాశారు. ఈ లేఖ యొక్క కాపీని Additional Director General of Prisons పంపించారు. తాము జైలులో ఉన్న ఆసుపత్రిని సందర్శించాలని తాము ప్రయత్నించినా అది నెరవేరలేదన్నారు. జులై 20వ తేదీ నుంచి ప్రతిరోజు నానావతి ఆసుపత్రికి ఫోన్ చేస్తున్నామని, కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాండ్ రావడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జైలు అధికారులకు తెలియచేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయని వరవరరావు కుమార్తె తెలిపారు. ఈ సమాచారాన్ని తమకు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రెగ్యులర్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆసుపత్రి వర్గాలకు ఆదేశాలు ఇచ్చే బాధ్యత జైలు అధికారులకు ఉందన్నారు.
అతని ఆరోగ్యం గురించి ఏ విషయం వెల్లడించకపోవడం అనైతికమని, అమానవీయమైందన్నారు. తమకు ఈ విషయంలో న్యాయం చేయాలని లేఖలో కోరడం జరిగిందన్నారు.
2020, జులై ప్రారంభంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్ అని రావడంతో..ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే..మెరుగైన వైద్య చికిత్స కోసం సెయింట్ జార్జీ ఆసుపత్రి నుంచి జులై 19వ తేదీన నానావతి హాస్పిటల్ కు తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని కుటుంబసభ్యులతో పాటు..వేలాది మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత కొంతకాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. భీమా కోరెగావ్ కేసులో వరవరరావును కీలక నిందితుడిగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్ లో పోలీసులు అరెస్టు చేశారు. పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. 2020, ఫిబ్రవరి నెలలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తమ తండ్రిని విడుదల చేయాలని వరవరరావు కుమార్తెలు ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ లకు లేఖలు రాశారు.