ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..రైతులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు

  • Published By: bheemraj ,Published On : November 26, 2020 / 07:42 PM IST
ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..రైతులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు

Updated On : November 26, 2020 / 7:55 PM IST

Delhi-Haryana border Tension : ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంభు సరిహద్దుల్లో హై టెన్షన్ ఏర్పడింది. ఛలో ఢిల్లీతో రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వాటర్ కెనాన్లు, భాష్పవాయుగోళాల ప్రయోగంతో పోలీసులు రైతులను ఢిల్లీ వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుండగా..బారికేడ్లు విరిచేయడం, రాళ్లు రువ్వడం వంటి చర్యలతో రైతులు ప్రతి ఘటిస్తున్నారు.



వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఛలో ఢిల్లీ చేపట్టాయి. వాటర్ కెనాన్‌తో రైతులను చెదరగొట్టేందుకు యత్నం చేశారు. వందలాదిగా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. క్రేన్ల సాయంతో బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. నోయిడా, గురుగావ్‌ నుంచి ఢిల్లీకి రాకపోకలు నిలిచిపోయాయి. హర్యానాలోని ఫతేబాద్ సహా పలు జిల్లాల నుంచి దేశరాజధానికి బయలుదేరిన రైతులను భద్రతాబలగాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నాయి.



కర్నాల్‌, రోహ్‌తక్‌-జజ్జార్ సరిహద్దుల్లో, అంబాలా దగ్గర శంభు సరిహద్దుల్లో ర్యాలీగా తరలివస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉదయం నుంచే హర్యానా-ఢిల్లీ మార్గంలోని ఐదు జాతీయ రహదారుల దగ్గర భారీగా సాయుధ బలగాలను మోహరించారు. డ్రోన్లతో శాంతిభద్రతలను పరిశీలించారు.