ఐసీయూలో ప్రశాంత్ కిశోర్.. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం
నిన్న ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది.

Prashant Kishor
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇవాళ బిహార్ రాజధాని పట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందుతోంది. బిహార్ సివిల్ సర్వీసెస్ (బీపీఎస్‌సీ) పరీక్షను రద్దు చేయాలని, ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిశోర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
అయితే, నిన్న ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోర్టు హెచ్చరించడం, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ప్రశాంత్ కిశోర్ దాన్ని తిరస్కరించారు. చివరకు ఆయనను సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆ తర్వాత కోర్టు నుంచి షరతులు లేకుండా బెయిల్ మంజూరు కావడంతో నిన్న రాత్రి జైలు నుంచి ప్రశాంత్ కిశోర్ విడుదలయ్యారు. అయితే, ఆయన నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిశోర్‌ను పట్నాలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రశాంత్ కిశోర్ డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు జాతీయ మీడియా తెలిపింది. ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించి కొన్ని వైద్యపరమైన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్యులు అన్నారు. ఆయన బలహీనంగా ఉన్నారని చెప్పారు. ఆసుపత్రిలో చేరే ముందు ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Chandrababu Naidu: సమగ్రమైన ప్రణాళికను రూపొందించాం: చంద్రబాబు