భారత్‌ను మొదట వ్యతిరేకించిన మల్దీవుల అధ్యక్షుడు.. ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నాడు.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ ముయిజ్జు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం భారత్ కు వచ్చారు. సోమవారం ముయిజ్జుతోపాటు ..

Maldivian President Mohamed Muizzu
Maldives President Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షులు మొహమ్మద్ ముయిజ్జు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం భారత్ కు వచ్చారు. సోమవారం ముయిజ్జుతోపాటు ఆదేశ ప్రథమ పౌరురాలు సాజిదా మొహమ్మద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. వీరికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రతి ద్రౌపది ముర్ములు ఘన స్వాగతం పలికారు. మొహమ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు రావడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్ నెలలో ముయిజ్జు అధ్యక్షడిగా అధికారం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్ పై వ్యతిరేకతతో వ్యవహరించాడు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల సమయంలోనూ మాల్దీవుల్లో భారత ప్రభావాన్ని తగ్గిస్తానంటూ ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో ముయిజ్జు అధికారంలోకి వచ్చాడు.
Also Read: PM Modi: ‘గర్బా’పై తాను రాసిన పాటను ట్విటర్‌లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. నెట్టింట వీడియో వైరల్
తొలుత చైనాకు ప్రాధాన్యం..
అధికారంలోకి వచ్చిన తరువాత ముయిజ్జు భారత్ ను విస్మరించి చైనా దేశానికి ప్రాధాన్యనిస్తూ వచ్చారు. సాధారణంగా గతంలో మాల్దీవుల అధ్యక్షులుగా ఎన్నికైన వారు మొదట భారత పర్యటనకు వచ్చేవారు. కానీ, ముయిజ్జ అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే 2024 జనవరి నెలలో చైనా పర్యటనకు వెళ్లడంతో దౌత్యపరంగా తాము భారత్ ను ఏమాత్రం పట్టించుకోవటం లేదని చెప్పకనే చెప్పాడు. ముయిజ్జు చైనాలో పర్యటించడం.. అదే సమయంలో మాల్దీవులకు చెందిన మంత్రులు భారత ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇదే సమయంలో మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేదతీరారు. అనంతరం సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్ట్ లో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫొటోలను షేర్ చేశారు. దీనిపై అప్పటి మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోదని పోస్టు పెట్టారు.
Also Read: ఇజ్రాయెల్, గాజా మధ్య ఎందుకు ఇన్ని దాడులు? చరిత్ర ఏం చెబుతోంది?
భారత్ విలువ తెలిసొచ్చింది..
మోదీ లక్షదీప్ పర్యటన తరువాత జరిగిన పరిణామాలతో మాల్దీవులపై భారత్ పర్యటకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బాయ్ కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ ట్యాగ్ టెండ్ర్ అయింది. ఇదేసమయంలో భారత్ బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. వాస్తవానికి హిందూ మహాసముంద్ర మధ్యలో ఉన్న దాదాపు 1200 పగడపు దీవుల సముదాయమే మాల్దీవులు. ఈ ద్వీప సమూహ దేశం జనాభా ఐదు లక్షల 20వేలు ఉంటుంది. మాల్దీవులు ఆహారం, మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలకోసం భారత్ మీదనే ఆధారపడుతోంది. భారత్ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లడం తగ్గడంతో అక్కడి విదేశీ మారకద్రవ్య నిల్వలను ప్రభావితం చేసింది. దీంతో భారతదేశం లేకుండా తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు గ్రహించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో ముయిజ్జు భారత్ పర్యటనకు వచ్చాడు. దీంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్లు సంకేతాలను మాల్దీవుల ప్రభుత్వం పంపించింది. తాజాగా నాలుగు నెలల వ్యవధిలోనే మరోసారి ముయిజ్జు భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు సాగనున్నాయి.
మొదటి నుంచి మాల్దీవులకు అండగా భారత్..
మాల్దీవులు రక్షణ, భద్రతా రంగంలో భారత్ దేశంపైన ఆధారపడి ఉంది. 1988 నుంచి మాల్దీవులకు భారత్ సహాయం అందిస్తోంది. ఈ బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2016లో ఒక ఒప్పందం కూడా కుదిరింది. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎంఎన్డీఎఫ్) రక్షణ శిక్షణలో ఉపయోగించే 70శాతం వస్తువులను భారతదేశం అందిస్తుంది. గత పదేళ్లలో 1500 మందికిపైగా సైనికులు శిక్షణ పొందారు. మాల్దీవుల్లో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు భారత్ రూ.52కోట్లు విరాళంగా ఇచ్చింది. అక్కడి విద్యారంగంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ – మాల్దీవుల మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగి 17కోట్ల నుంచి 50 కోట్ల డాలర్లకు చేరుకుంది. భారత్ నుంచి భారీ సహాయం పొందుతూనే మహ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తరువాత భారత్ ను విస్మరించే ప్రయత్నం చేశాడు. కానీ, చివరికి తప్పు తెలుసుకొని భారత్ తో సంబంధాలను మరింత పెంచుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు.