కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 08:14 PM IST
కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

Updated On : November 13, 2020 / 8:54 PM IST

Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్యతిరేక చట్టాలు’గా పేర్కొంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న పంజాబ్ రైతులు ఇవాళ(నవంబర్-13,2020)కేంద్రమంత్రులు పియూష్ గోయల్,నరేంద్రసింగ్ తోమర్ లతో సమావేశమయ్యారు.



ఈ సందర్భంగా పంజాబ్ రైతు సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లకు సంబంధించి ఓ పెద్ద లిస్ట్ ను కేంద్రమంత్రులకు అందించారు. రైతు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు తమ పొలాల్లో పంట వ్యర్థాల దహనం చేసినందుకుగాను అరెస్ట్ అయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఢిల్లీ,దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కారణమవుతున్న పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లోని పంట వ్యర్థాల దహనానికి పాల్పడితే 1కోటి రూపాయల వరకు ఫైన్,5ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందనే విషయం తెలిసిందే.



అదేవిధంగా,ప్రవేటీకరణను ప్రోత్సహించేలా..రైతులకు ఉచిత కరెంట్ సరఫరా నలిచిపోయేలా ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ సవరణను కూడా వెనక్కితీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పంజాబ్ కిసాన్ యూనియన్ లీడర్ సుఖ్ దర్శన్ సింగ్ నాథ్…వ్యవసాయంలో సంస్కరణలు అంటూ ఇటీవల తీసుకొచ్చిన 3బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రవ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్,రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ వద్ద డిమాండ్ చేశాం. ఈ బిల్లుల వల్ల వ్యవసాయంపై కార్పొరేట్ గ్రిప్ చాలా బలపడుతుంది.



అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల కారణంగా నిలిపివేయబడిన గూడ్స్ రైళ్ల సర్వీసులను వెంటనే పునరుద్దరించాలని కోరినట్లు సుఖ్ దర్శన్ సింగ్ నాథ్ తెలిపారు. కాగా, పంజాబ్ లోని దాదాపు 30 లొకేషన్లలో రైతులు…హైవేల దిగ్భంధం,రైల్ రోకోలు నిర్వహించడంతో అన్ని ప్యాసింజర్ రైళ్లు,గూడ్స్ రైళ్లను రైల్వేశాఖ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే,ప్రస్తుతం అన్ని ట్రాక్ లు ఖాళీ చేయబడ్డాయని సుఖ్ దర్శన్ సింగ్ నాథ్ తెలిపారు.



అయితే,తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు కొనసాగుతాయని రైతులు చెప్పారు. తమ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఈ నెల18న చంఢీఘర్ లో రైతు సంఘాల నాయకులు సమావేశమవనున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా నవంబర్-26న ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం జరుగుతుందని రైతు సంఘాల నాయకులు సృష్టం చేశారు.



కాగా, గత నెలలో పంజాబ్ ప్ర‌భుత్వం..కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్రం తెచ్చిన మూడు చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని త‌న తీర్మానంలో సీఎం అమ‌రీంద‌ర్ ఆరోపించారు. ఈ మూడు చ‌ట్టాల‌ను ఏక‌ప‌క్షంగా స‌భ వ్య‌తిరేకించినట్లు అమ‌రీంద‌ర్ చెప్పారు. కేంద్రం 3వ్యవసాయ చట్టాలని రద్దు చేయకపోతే..రైతులతో కలిసి యువత కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పంజాబ్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లు అమరీందర్ చెప్పారు.