రత్న భండార్ రహస్యం వీడేనా..! మూడో గది తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్, అంతుచిక్కని సంపద అక్కడే ఉందా?

ఆభరణాలు అన్నింటిని తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ పద్ధతిని సమీక్షిస్తారని రథ్ వివరించారు.

రత్న భండార్ రహస్యం వీడేనా..! మూడో గది తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్, అంతుచిక్కని సంపద అక్కడే ఉందా?

Puri Jagannath Temples Ratna Bhandar : పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడో గది రేపు తెరుచుకోబోతోంది. 46ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదిని సీల్ చేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొట్టి పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము క్లారిటీ ఇవ్వలేము అని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఈ రహస్య గదిని తెరిచి ఆభరణాలు తరలించబోతున్నారు.

వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. రేపు ఉదయం 9 గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ విశ్వనాథ్ తెలిపారు. ఆభరణాలు అన్నింటిని తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ పద్ధతిని సమీక్షిస్తారని రథ్ వివరించారు.

ఇక ఈ ప్రక్రియనంతా వీడియోగ్రఫీ చేస్తామన్నారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. జూలై 14న.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్, ఔటర్ చాంబర్స్ తెరిచారు. ముందుగా ఔటర్ చాంబర్ లో రెండు గదులను తెరిచి అందులోని ఆభరణాలను టేక్ తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అసలైన మూడో గదిని తెరిచేందుకు ప్రయత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిందిన గుర్తులు కనిపించాయి. అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు.

15న పూరీలో బహుళ యాత్ర ముగిసింది. పూరీలో బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో హైలెవెల్ కమిటీ భేటీ అయ్యింది. నేడు స్వామి వారికి సునా బేషా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కారణాల వల్ల 18వ తేదీనే రహస్య గదిని మళ్లీ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, 14వ తేదీన కమిటీ సభ్యులు గదులను తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్రవైఢ్యూరాలు భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Also Read : కల్పితం కాదు, రామసేతు వారధి వాస్తవ నిర్మాణమే.. ఏళ్ల నాటి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఇస్రో