ప్రభుత్వాలపై పోరాడే పరిస్థితి కనిపించడం లేదు: రాహుల్ బజాజ్

దేశంలో భయంతో కూడిన వాతావరణం ఉందని, ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారని.. ప్రభుత్వం విమర్శను స్వీకరిస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదని పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అన్నారు. ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన రాహుల్ బజాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్‌లు ఉన్న ఒక ప్యానల్‌ను ”ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రజలకు ఎందుకివ్వడం లేదు’ అని ప్రశ్నించారు.
ఎకనామిక్ టైమ్స్ తన యూట్యూబ్ చానల్‌లో ఉంచిన ఈ కార్యక్రమ వీడియోలోనూ రాహుల్ బజాజ్ సంధించిన ప్రశ్నపై విశేష స్పందన వస్తుంది. యూపీయే ప్రభుత్వ కాలంలో ప్రజలకు ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉండేదని, కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో భయానక వాతావరణం ఉందని రాహుల్ బజాజ్ అన్నట్లుగా మీడియా సంస్థలు తెలిపాయి.
It can be difficult to speak truth to power. Circumstances however, have made doing so increasingly necessary.#RahulBajaj stands out for his courage & integrity & for calling a spade a spade. pic.twitter.com/O6d7EWtiCd
— Congress (@INCIndia) December 1, 2019
‘యూపీఏ-2 పాలన ఉన్నప్పుడు విమర్శించగలిగేవాళ్లం. మీరిప్పుడు బాగా పనిచేస్తున్నారు. కానీ, మేం ఏ విషయంలోనైనా విమర్శించాలనుకుంటే మాత్రం దాన్ని మీరు అభినందిస్తారన్న నమ్మకం లేదు’ అన్నారాయన. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ 4.5గా నమోదైందని.. ఇది గత ఆరున్నరేళ్లలో అత్యల్పమని నేషనల్ స్టేటిస్టిక్స్ ఆఫీసు నుంచి గణాంకాలు వెలువడిన మరుసటి రోజే బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, రాహుల్ బజాజ్ వ్యాఖ్యలకు అమిత్ షా స్పందిస్తూ ‘మీరిప్పుడు ప్రశ్నించిన తరువాత.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జనం భయపడుతున్నారని నేనే మాత్రం అనుకోను’ అన్నారు. ‘ఎవరూ భయపడాల్సిన అవసరమే లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మీడియా నిత్యం విమర్శిస్తూనే ఉంది. అయినా, ప్రశ్నించడానికి, విమర్శించడానికి భయపడే వాతావరణం ఉందని మీరనుకుంటే ఆ పరిస్థితి లేకుండా చేయడానికి కృషిచేస్తాం’ అన్నారు.