దమ్ముంటే ట్రంప్ అబద్ధాలకోరు అని చెప్పు.. లేదంటే..: లోక్‌సభలో మోదీకి రాహుల్ సవాల్
"పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయబోమని పాక్‌కు ముందే చెప్పామని అన్నారు. మన వైమానిక దళానికి స్వేచ్ఛ ఇవ్వాలి" అని రాహుల్ అన్నారు.

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అన్నారు. ట్రంప్ అబద్ధాలకోరు అని చెప్పాలని లేదంటే
యుద్ధంలో మన యుద్ధవిమానాలు ఏవీ నష్టపోలేదని చెప్పాలని అన్నారు.
“ఇందిరా గాంధీకి ఉన్న ధైర్యంలో కనీసం సగం ఉన్నా నరేంద్ర మోదీ పార్లమెంట్ లోకి వచ్చి, మనం ఏ విమానాన్నీ కోల్పోలేదని, ట్రంప్ వల్ల కాల్పుల విరమణ జరగలేదని చెప్పాలి” అని రాహుల్ గాంధీ అన్నారు.
“విజయం సాధించామని ప్రకటించారు కానీ, ఆపరేషన్ పూర్తికాలేదు. పాకిస్థాన్ ను వెనక్కి నెట్టేశామని అంటున్నారు. కానీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భోజనం చేశారు” అని రాహుల్ గాంధీ అన్నారు.
“పాకిస్థాన్ లోకి వెళ్లి, దాడులు చేశారు. కానీ మన పైలట్లకు పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేయవద్దని చెప్పారు. పాకిస్థాన్ సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయబోమని పాక్‌కు ముందే చెప్పామని అన్నారు.
మన వైమానిక దళానికి స్వేచ్ఛ ఇవ్వాలి. భారత్ ఎన్నో విమానాలు కోల్పోయింది అనే విషయాన్ని నేను అంగీకరించను. కానీ, కొన్నింటిని మాత్రం కోల్పోయామని ఒప్పుకుంటాను. దాడి చేయవద్దనే ఆంక్షలు పెట్టడంతోనే అది జరిగింది’ అని రాహుల్ అన్నారు.
“ఆపరేషన్ సిందూర్ రాత్రి 1.05 గంటలకు ప్రారంభమైంది, 22 నిమిషాల్లో ముగిసింది. 1.35 గంటలకు పాక్‌కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలపై దాడి చేశామని, ఉద్రిక్తత కోరుకోవడం లేదని చెప్పారు. యుద్ధం నడుస్తుండగానే మీ వ్యూహాన్ని ఎందుకు బయటపెట్టారు? మీరు కేవలం దాడి చేయలేదు, మీ పరిమితుల గురించి కూడా వివరించారు” అని రాహుల్ గాంధీ అన్నారు.