ప్రాణం పోయినా సారీ చెప్పను : రాహుల్ గాంధీ

”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రధాని మోడీ పేదలను దోచి.. అంబానీ, ఆదానీలకు ఇచ్చారని ఆరోపించారు. అంబానీ, ఆదానీలకు 25 పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్న రాహుల్ గాంధీ… ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కామెంట్ చేశారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలను ప్రధాని మోడీ కోలుకోలేని దెబ్బతీశారని రాహుల్ గాంధీ వాపోయారు.
రేపిన్ ఇండియా వ్యాఖ్యల వివాదంపైనా రాహుల్ స్పందించారు. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పారు. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అన్నారు. నా పేరు రాహుల్ సావర్కార్ కాదు.. రాహుల్ గాంధీ అన్నారు. క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు.. మోడీ, అమిత్ షా లే దేశ ప్రజలకు సారీ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
దేశం కోసం పోరాడాలన్న రాహుల్.. కార్యకర్తలు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉల్లి కిలో రూ.200 దాటినా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోడీ తనను తాను గొప్ప దేశభక్తుడు అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాహుల్ గాంధీ.