Samrat Choudhary: రాహుల్ గాంధీని లాడెన్‌తో పోల్చుతూ బీజేపీ బిహార్ అధ్యక్షుడు కామెంట్స్.. ఇక నితీశ్ గురించైతే..
నితీశ్ కుమార్ దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు.

Samrat Choudhary
Samrat Choudhary – BJP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తో పోల్చుతూ బీజేపీ బిహార్ (Bihar) అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి విమర్శలు గుప్పించారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు.
బిహార్ లోని అరారియా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో సామ్రాట్ చౌదరి మాట్లాడారు. ” లాడెన్ లాగా రాహుల్ గాంధీ గడ్డం పెంచుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీలా తాను ప్రధానమంత్రి అవుతానని రాహుల్ అనుకుంటున్నారు ” అని చెప్పారు. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం పెంచిన విషయం తెలిసిందే. అనంతరం గడ్డం తొలగించారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై కూడా సామ్రాట్ చౌదరి విమర్శలు గుప్పించారు. ” నితీశ్ కుమార్ దేశం మొత్తం తిరుగుతున్నారు. తానే దేశానికి ప్రధానమంత్రి అని చెబుతున్నారు. నితీశ్ కుమార్ ప్రధానమంత్రా? ఆయన మానసిక పరిస్థితి బాగోలేదా? దయచేసి చెప్పండి ” అని వ్యాఖ్యానించారు.