Rahul Gandhi: ఓబీసీ అంశాన్ని లేవనెత్తుతూ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటారని, కానీ కులగణన చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi on Caster Census: కొద్ది రోజులుగా ఓబీసీ అంశంపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. ఈసారి అదే అంశాన్ని లేవనెత్తుతూ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది సెక్రెటరీలు ఉంటే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని, ఎందుకు వారికి ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘కులగణన నిర్వహించి తీరాలి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారు ఎంత మంది ఉన్నారో తెలియాలి. కానీ కులగణన చేసేందుకు, దాన్ని యటపెట్టేందుకు ప్రధానమంత్రి మోదీ భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలోనే కులాల ఆధారంగా న్యాయం జరగలేదు. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది సెక్రెటరీలు ఉంటే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. ఇందుకే కులగణన జరిగి తీరాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటారని, కానీ కులగణన చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో అమలుకు ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటో చెప్పాలని అడిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చామని, కానీ ప్రభుత్వమే అమలు చేయడం లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.