నకిలీ సెక్స్ రాకెట్ కేసు, 4 ఏళ్ల విచారణ..10 మంది పోలీసులపై కేసు

అమ్రోహ హోటల్ లో నకిలీ సెక్స్ రాకెట్ కేసులో 13 మందిని ఇరికించినందుకు 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ ఘటన 2015లో చోటు చేసుకుంది. దాడిలో అరెస్టయిన వారికి సంబంధించిన సరైన విషయాలు వెల్లడించలేదని, కనీసం ప్రాథమిక సమాచారం కూడా పోలీసు టీం ధృవీకరించలేదని బరేలీ సీబీ సీఐడీ అదనపు ఎస్పీ, సెక్టార్ ఆఫీసర్ ప్రగ్యా మిశ్రా చెప్పారు.
మాజీ డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్స్ పెక్టర్లు కేసు నమోదైన వారిలో ఉన్నారు. హోటల్ యజమాని దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తు ప్రారంభించి..సెక్స్ రాకేట్ కేసును చేధించినట్లు అమ్రోహా పోలీసులు చేసిన వాదనపై దర్యాప్తు చేయాలని అలహాబాద్ కోర్టు ఆదేశించడంతో సీబీ – సీఐడీ రంగంలోకి దిగింది.
గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇన్వెస్టింగ్ ఆపీసర్ శివరాజ్ సింగ్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీఐ మొహల్ లాల్, సబ్ ఇన్స్ పెక్టర్లు విజయ్ కుమార్ యాదవ్, నీరజ్ కుమార్, ఆర్సీ వర్మ, కానిస్టేబుళ్లు సురేష్ కుమార్, హిమ్మత్ సింగ్, కృష్ణ పాల్ చౌహాన్, మోను తోమర్, సంధ్య త్యాగి, రితు దాక, మొత్తం 10 మంది పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, నిబంధనల్లు ఉల్లంఘించినట్లు ఎఫ్ఐఆర్ దాఖలైంది.
అరెస్టయిన కుటుంబసభ్యులు అఫిడవిట్లు దాఖలు చేశారు. సెక్స్ రాకెట్ ఆరోపణలను వారు ఖండించారు. అదుపులోకి తీసుకున్న వారిలో దంపతులు కూడా ఉన్నారని వెల్లడైంది.
దీనిని సీఐ మొహల్ లాల్ వ్యతిరేకించారు. ఆనాడు ఎవరూ ప్రశ్నించలేదని, అబద్దం నిలవదని, నిజం బయటకు వస్తుందన్నారు. పోలీసు శాఖ నుంచి రిటైర్ అయిన అనంతరం ఇతను 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘజియాబాద్ నుంచి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) టికెట్ పై పోటీ పడ్డారు. కానీ పరాజయం చెందారు.
2015, జూన్ నెలలో ఎలాంటి ఆధారాలు లేకుండా..నకిలీ పత్రాలు సృష్టించి పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీ – సీఐడీ వెల్లడించింది. దర్యాప్తు చేయడానికి నాలుగేళ్లు సమయం పట్టింది. హోటల్ మేనేజర్ పుష్పేంద్ర, యజమానితో సహా 13 మంది అరెస్టయిన వారిలో ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎఫ్ ఫ్లయింగ్ ఆఫీసర్ గుల్బీర్ సింగ్ కూడా ఉన్నారు.
హోటల్ పై దాడి చేసిన క్రమంలో..రెస్టారెంట్ లో కూర్చొన్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని దర్యాప్తులో తేలింది. వీరు ఎందుకు కూర్చొన్నారు ? హోటల్ లో రూం బుక్ చేసుకున్నారా ? లేదా ? తదితర విషయాలపై ప్రాథమికంగా దర్యాప్తు చేయలేదని వెల్లడైంది.
ఈ సమయంలో హోటల్ వద్ద నిలబడిన వ్యక్తిని, కుమార్తె వివాహ సందర్భంగా మాట్లాడడానికి వచ్చిన హోటల్ యజమాని మామయ్య కూడా అరెస్టు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు అతను ఇచ్చాడని బరేలీ సీబీ సీఐడీ అదనపు ఎస్పీ, సెక్టార్ ఆఫీసర్ ప్రగ్యా మిశ్రా చెప్పారు. పోలీసు టీం ఇచ్చిన నివేదిక కూడా భిన్నంగా ఉందన్నారు.