రాజీవ్​ గాంధీకి ప్రముఖుల నివాళి…నాన్నకు ప్రేమతో రాహుల్ ట్వీట్

  • Published By: venkaiahnaidu ,Published On : August 20, 2020 / 02:47 PM IST
రాజీవ్​ గాంధీకి ప్రముఖుల నివాళి…నాన్నకు ప్రేమతో రాహుల్ ట్వీట్

Updated On : August 20, 2020 / 3:21 PM IST

ఇవాళ(ఆగస్టు-20,2020)భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్​ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్​ గాంధీ,వెస్ట్ బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, కెప్టెన్​ అమరిందర్​ సింగ్​ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.



రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఐటీ రంగానికి ఆయన చేసిన కృషి ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు.



అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తన తండ్రిని ఈరోజు, ప్రతిరోజు మిస్సవుతున్నానని పేర్కొన్నారు. ప్రధానిగా తన తండ్రి అందించిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి నా తండ్రి అయినందుకు, అలాంటి వ్యక్తికి కుమారుడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను చాలా లక్కీ. భవిష్యత్తు మీద ఆయనకున్న విజన్ చాలా గొప్పది. వీటిన్నింటిని మించి ఆయన ఓ గొప్ప మనసున్న వ్యక్తి అంటూ రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకున్నారు.



ఆగస్టు 20న జన్మించిన రాజీవ్​ గాంధీ.. 1984-89 మధ్య ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు ఇంకా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.