Ratan Tata: అసాధారణ మానవతావాదిని కోల్పోయాం.. రతన్ టాటా మృతికి ప్రముఖుల సంతాపం

దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మనవాతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Ratan Tata: అసాధారణ మానవతావాదిని కోల్పోయాం.. రతన్ టాటా మృతికి ప్రముఖుల సంతాపం

Ratan Tata

Updated On : October 10, 2024 / 7:50 AM IST

Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వ్యాపార రంగంలో సాధించిన విజయాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ  దేశంలోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార వేత్తలు నివాళులర్పించారు.

Also Read: దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా…

అసాధారణ మానవతావాది రతన్ టాటా : ప్రధాని నరేంద్ర మోదీ
దార్శనికులైన వ్యాపార దిగ్గజం, అసాధారణ మనవాతా వాది అయిన రతన్ టాటా మనకు దూరం అయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను ఊహించడం, ఆ ప్రతిఫలాలను సమాజానికి తిరిగి ఇవ్వడం రతన్ టాటా నైజం. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ద్యం, జంతు సంరక్షణ సేవల్లోనూ రతన్ టాటా ఎంతో ముందుడేవారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. దేశంలోనే ఘన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ నకు ఆయన ఎంతో స్థిరమైన నాయకత్వాన్ని అందించారని, బోర్డు రూం కార్యకలాపాలకు మించి దేశానికి అమూల్య సేవలందించారని ప్రధాని అన్నారు.

భారత్ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రతన్ టాటా మరణంతో భారతదేశం ఓ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దాతృత్వం, సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం నిరుపమానం అన్నారు.

దేశ ముద్దుబిడ్డను కోల్పోయాం : రాహుల్ గాంధీ
రతన్ టాటా మృతికి కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో చెరగని గుర్తులను రతన్ టాటా మిగిల్చి వెళ్లిపోయారని పేర్కొన్నారు. రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్ నకు సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.

నిజమైన మానవతావాదిని కోల్పోయాం : సీఎం చంద్రబాబు
దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన తక్కువ మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం ఒక వ్యాపార దిగ్గజాన్నే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. సామాజాన్ని మెరుగుపరిచేందుకు రతన్ టాటా నిరంతరం ప్రయత్నించారని, మానవీయత మూర్తీభవించిన అసాధారణ మనిషి ఆయన అని చంద్రబాబు అన్నారు.

ప్రపంచంలో తమదైన ముద్రం వేశారు : సీఎం రేవంత్ రెడ్డి
వ్యాపార రంగంలో రతన్ టాటా పాటించిన విలువలు, సామాజిక సంక్షేమం కోసం ఆయన పడిన తపన స్ఫూర్తిదాయకం. సేవకు ఆయన ప్రతిరూపం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మెరుగైన భారత్ కోసం నిరంతరం తపనపడేవారు : అమిత్ షా
దిగ్గజ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది రతన్ టాటా అని అమిత్ షా అన్నారు. దేశ అభివృద్ధికోసం ఆయన నిస్వార్థంగా అంకితమయ్యారు. మెరుగైన భారత్ కోసం ఆయన నిరంతరం తపనపడేవారని అన్నారు.

దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ : వైఎస్ జగన్
రతన్ టాటా మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.

నిజమైన ఆవిష్కర్త.. అద్భుతమైన వ్యక్తి : కేటీఆర్
నిజమైన ఆవిష్కర్త, అద్భుతమైన వ్యక్తి, అనేక మందికి ప్రేరణ, వినయపూర్వకమైన వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా మరణం వ్యాపార, దాతృత్వ, మానత్వం యొక్క ప్రపంచంలో శూన్యతను మిగిల్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. టీహబ్ ను చూసిన ప్రతీసారి మేము మిమ్మల్ని గుర్తుచేసుకుంటాం సార్. మీరు మా హృదయాల్లో నివసిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

భారతీయులందరికీ బాధాకరమైన రోజు : మెగాస్టార్ చిరంజీవి
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా పలు రూపాల్లో రతన్ టాటా అందించిన సేవలను అందుకోని భారతీయుడు ఉండరు. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు, సమగ్రత, ధృక్పథం ఎల్లప్పుడూ తరాలకు స్ఫూర్తినిస్తాయి, మార్గనిర్దేశం చేస్తాయని చిరంజీవి అన్నారు.

రతన్ టాటాది బంగారం లాంటి హృదయం : ఎన్టీఆర్
రతన్ టాటా మృతి పట్ల ప్రముఖ సినీ హీరో ఎన్టీఆర్ నివాళులర్పించారు. రతన్ టాటాది బంగారం లాంటి హృదయం. దూరదృష్టిగల నాయకుడు. ఎంతో మంది జీవితాలను మార్చేసిన దిగ్గజం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

ఆయన ఓ లెజెండ్ : దర్శకుడు రాజమౌళి
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మృతి పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి నివాళులర్పించారు. ఆయన ఓ లెజెండ్.. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోలేం. పంచభూతాలతో పాటు ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చారు. ఎప్పటికీ ఆయనకు నేను ఆరాధకుడినే. జై హిందు అంటూ పోస్టు పెట్టారు.