శంతను నాయుడు ఎవరు.. రతన్ టాటాతో అతనికున్న బంధం ఏమిటి.. వారిని కలిపింది ఎవరో తెలుసా?

2021లో తన 84వ పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. అందులో రతన్ టాటాతో ఉన్న యువకుడే కారణం.

శంతను నాయుడు ఎవరు.. రతన్ టాటాతో అతనికున్న బంధం ఏమిటి.. వారిని కలిపింది ఎవరో తెలుసా?

Shantanu Naidu Ratan Tata

Updated On : October 10, 2024 / 12:22 PM IST

Ratan Tata Passed Away: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు నివాళులర్పించారు. తాజాగా రతన్ టాటా మరణంపై శాంతను నాయుడు ఎమోషనల్ పోస్టు చేశారు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో శాన్యం మిగిలింది.. ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దు:ఖం పూడ్చలేనిది. ‘గుడ్ బై మై డియర్ లైట్ హౌస్’ అని ఆవేదనతో పోస్టు చేశారు. శంతను నాయుడు రతన్ టాటా చివరి దశలో అత్యంత సన్నిహితంగా మెగిలిన వ్యక్తి . రతన్ టాటాకు అత్యంత ఇష్టమైన యువ స్నేహితుడు. టాటా ట్రస్ట్ లో పిన్న వయస్సు కలిగిన జనరల్ మేనేజర్ గా, టాటాకు అత్యంత విశ్వాస పాత్రుడైన అసిస్టెంట్ గా శంతను వ్యవహరించారు. రతన్ టాటాతో ఆ యువకుడి స్నేహం అందరినీ ఆశ్చర్యపర్చింది.

 

శంతను నాయుడు ఎవరు?
రతన్ టాటా వార్తల్లో నిలవడం మామూలే అయినా 2021లో తన 84వ పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఓ ఫొటో చర్చనీయాంశంగా మారింది. అందులో రతన్ టాటాతో ఉన్న యువకుడే కారణం. ఆ యువకుడు ఎవరనే చర్చలు మొదలయ్యాయి. అప్పుడే శంతను నాయుడు టాటా అసిస్టెంట్ గా తెరపైకి వచ్చాడు. దానికితోడు అంతకంటే ఎక్కువగా రతన్ టాటాకు ఓ యువ స్నేహితుడు. అతి కొద్దికాలంలోనే టాటా కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా శాంతను నాయుడు మారాడు. శంతను నాయుడు 1993లో పూణెలో జన్మించాడు. సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. తదనంతరం, అతను కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి ఎంబీఏ చేశాడు. 2014లో పూణెలోని టాటా ఎల్ క్సీలో ఆటో మొబైల్ డిజైన్ ఇంజనీర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించాడు.

రతన్ టాటాకు శంతన నాయుడుకు స్నేహం ఎలా కుదిరింది?
శంతను నాయుడు స్వతహాగా జంతు ప్రేమికుడు. సామాజిక సేవ పట్ల అతనికి ఉన్న ఆసక్తి కారణంగా మోటోపౌస్ అనే పేరుతో ఒక సంస్థకు శ్రీకారం చుట్టాడు. టాటా ఎల్ క్సీలో పనిచేస్తున్న సమయంలో రాత్రి వేళల్లో వేగంగా వెళ్తున్న వాహనాల కింద పడి వీధి కుక్కలు చనిపోవడం శంతను మనసుకు బాధ కలిగించింది. వీధి కుక్కల మెడలకు మెరిసే కాలర్లు వేసేందుకు ‘మెటోపాస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అది విశేష ఆదరణ పొందింది. ఎన్నో కుక్కల ప్రాణాలు కాపాడేలా చేసింది. శంతను ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమానికి ఆర్థిక మద్దతు కోసం శంతను నాయుడు స్వయంగా రతన్ టాటాకు ఒక లేఖ రాశాడు. స్వతహాగా జంతు ప్రేమికుడు అయిన రతన్ టాటా దృష్టిని ఈ కార్యక్రమం ఎంతగానో ఆకర్షించింది. దీంతో అతన్ని ముంబైకి పిలిపించాడు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. జంతువుల పట్ల ప్రేమ, తదితర విషయాలపై వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో వీరి స్నేహం ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని మాట్లాడుకునేంత స్థాయికి చేరింది.

 

వృద్ధులకు ఆసరాగా ‘గుడ్ ఫెల్లోస్’..
టాటా గ్రూప్ లో ఒకవైపు రతన్ టాటాకు జనరల్ మేనేజర్ గా తన విధులు నిర్వర్తిస్తూనే శంతను నాయుడు మరో స్టార్టప్ కూడా ప్రారంభించాడు. అదే సీనియర్ సిటిజెన్లకు చేదోడుగా ఉండేందుకు ఉద్దేశించిన గుడ్‌ఫెల్లోస్. దీనిలో రతన్ టాటా పెట్టుబడులు కూడా పెట్టారు. పెద్ద వయస్సులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత.. రతన్ జీతో స్నేహం వల్లే తనకు తెలిసిందని శంతను ఓ సందర్భంలో వెల్లడించాడు.