గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ సీఎం

దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఫోటో.
ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో స్మార్ట్‌గా కనిపించే ఒమర్ అబ్దుల్లా.. ఇలా గుర్తుపట్టరాకుండా మారిపోయాడా..? అని చాలామంది నెటిజెన్స్ ఆయన ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. నిర్బంధం కారణంగా ఆయన ముఖంలో వృద్దాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్నెళ్లుగా ఆయన నిర్బంధంలో ఉన్నప్పటికీ.. ఆ ఫోటోని చూస్తుంటే 30 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.
ఒమర్ అబ్దుల్లా ఫోటోపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన వైరల్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆమె.. ఒమర్ అబ్దుల్లాను తొలుత చూడగానే తాను కూడా గుర్తుపట్టలేకపోయానన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు (గృహ నిర్బంధం) జరగడం దురుదృష్టకరమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు పలకాలని ప్రశ్నించారు. ఒమర్ తాజా ఫోటోపై పీడీపీ నాయకురాలు,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఆయన్ని ఇలా చూసి నివ్వెరపోయారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు.
ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నిర్బంధం నుంచి విముక్తి కలిగేంతవరకు అబ్దుల్లా గడ్డం తీయబోయరని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆయన 50వ వడిలోకి అడుగుపెట్టబోతున్నారు.