కరోనా చికిత్సకు మరో మెడిసిన్

వినికిడి సమస్య, మానసిక రుగ్మతలు సహా అనేక వ్యాధులకు ఉపయోగిస్తున్న ఓ మెడిసిన్.. కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అధునాతన కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి దీనిని గుర్తించారు శాస్త్రవేత్తలు.
కరోనా వైరస్ అనేది మన శరీరంలోని కణాల్లో చేరకుండా అడ్డుకునేందుకు యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్, బ్యాక్టిరిసైడల్, సెల్-ప్రొటెక్టివ్ లక్షణాలతో కూడిన రసాయన సమ్మేళనం ‘ఎబ్సెలెన్’ కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా అడ్డుకోగలదని గుర్తించారు. ఇప్పటికే బైపోలార్ డిజార్డర్, వినికిడి లోపం చికిత్సలకు ఈ మెడిసిన్‌ను ఉపయోగిస్తున్నారు.
కరోనా మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే వివిధ రసాయన సమ్మేళనాలపై యూఎస్‌లోని చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అత్యాధునిక కంప్యూటర్ స్టిమ్యులేషన్లను ఉపయోగించి, ‘ఎబ్సెలెన్’ అనేది కరోనాను అడ్డుకునేందుకు అత్యుత్తమంగా పనిచేస్తుందని గుర్తించారు. కరోనా వైరస్‌లోని అణువుకు సంబంధించిన ప్రొటీస్ (ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్) ‘ఎంపీఆర్‌ఓ’ అనేది దాని జీవితచక్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని కనుగొన్నారు.
కరోనా వైరస్ జీవిత చక్రంలో కీలక పాత్ర పోషించే ఎంపీఆర్‌వో అనే ఎంజైమ్‌ను వీరు విశ్లేషించారు. తన జన్యు పదార్థమైన ఆర్‌ఎన్‌ఏ నుంచి ప్రొటీన్లను తయారుచేసుకునేలా వైరస్‌కు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా మానవ కణంలో వైరస్ సంఖ్య భారీగా పెరిగేలా చూస్తుంది. ఈ ‘ఎంపీఆర్‌ఓ’ పనితీరును మందగించే శక్తి ‘ఎబ్సెలెన్’ ఔషధానికి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, ఇప్పటికే ఈ డ్రగ్ అనేక క్లినికల్ ట్రయల్స్‌లో సురక్షితం అని తేలిందని వారు చెబుతున్నారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా కొత్త చికిత్సా వ్యూహాలను అభివృద్ధి చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.