Second Covid Wave Peak : మరో 20 రోజుల్లో పీక్ స్టేజ్‌లోకి కరోనా సెకండ్ వేవ్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటున్నాయి. మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి.

Second Covid Wave India
Second Covid Wave India Peak : కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటున్నాయి. మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. దేశంలో మార్చి నెలలో ప్రారంభమైన సెకండ్ వేవ్ విజృంభణ.. మే మధ్యలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని భారతీయ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక వెల్లడించింది. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
భారతదేశంలో గత 24 గంటల్లో 379,257 కొత్త కేసులు నమోదు కాగా.. 3,645 మరణాలు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 30.84 లక్షలకు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో భారతీయ కరోనా రికవరీ రేటు 97శాతంగా ఉండేది. ఇప్పుడు 82.5 శాతంగా ఉంది. 69 రోజుల వ్యవధిలో రికవరీ రేటు 14.5 శాతంగా తగ్గింది. ఇతర దేశాలతో రికవరీ రేటుతో పోలిస్తే.. భారత్ లో రెండో వేవ్ రికవరీ రేటు 77.8శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది.
రికవరీ రేటులో ప్రతి 1 శాతం తగ్గుదలకు 4.5 రోజుల సమయం పట్టింది. ఇప్పటి నుంచి మరో 20 రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ లోకి వెళ్తుందని నివేదిక స్పష్టం చేసింది. రికవరీ రేటు ప్రతి 1 శాతం తగ్గినప్పటికీ యాక్టివ్ కేసుల్లో 1.85 లక్షలు పెరుగుతాయని అంచనా వేసింది. మే మధ్య నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 36 లక్షలకు చేరుతుందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్లు విధిస్తుండగా.. భారతీయ ఆర్థిక సంవత్సరం 2022లో వృద్ధిరే అంచనాను 10.4 శాతం వాస్తవ జీడీపీ, 14.2 శాతం నామమాత్రపు జిడిపిగా సవరించారు.