SP MP : తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన ఎంపీ..దేశ ద్రోహం కేసు

అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్‌

SP MP : తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన ఎంపీ..దేశ ద్రోహం కేసు

Sp Mp

Updated On : August 18, 2021 / 6:26 PM IST

SP MP అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్‌పై దోశ ద్రోహం కేసు నమోదైంది. తాలిబన్ పోరాటంపై ప్రశంసలు కురిపిస్తూ..వారిని భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన మరో ఇద్దరిపై కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదుచేశారు. మంగళవారం రాత్రి సంభాల్ బీజేపీ నేత రాజేష్ సింఘాల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఈ విషయమై సంభాల్ ఎస్పీ చక్రేశ్ మిశ్రా మాట్లాడుతూ..సంభాల్ నియోజకవర్గ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్‌ తన ప్రెస్ మీట్ లో తాలిబన్ ఉద్యమాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అంతేకాకుండా తాలిబన్ల పోరాటాన్ని..భారత స్వాతంత్ర్య ఉద్యమంతో పోల్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాలిబన్ సంస్థని ఒక ఉగ్రసంస్థగా భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అటువంటి ఉగ్రసంస్థపై ప్రసంశలు కురిపిస్తూ లేదా వారికి మద్దుతుగా మాట్లాడమనేది దేశ ద్రోహం కిందకే వస్తుంది. వైరల్ వీడియోని పరిగణలోకి తీసుకున్నాం మరియు దీనికి సంబంధించి కోత్వాలిలో ఎంపీ రెహ్మాన్‌పై ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో ఎంపీ రెహ్మాన్ పై ఐపీసీలోని సెక్షన్ 124-A, 153-A, 295Aల కింద ఆయనపై కేసు నమోదు చేశాం. మొహమ్మద్ ముఖీమ్,చౌదరి ఫైజాన్ అనే ఇద్దరు వ్యక్తులు తమ ఫేస్ బుక్ ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సంభాల్ ఎస్పీ వివరించారు.

మీడియా సమావేశంలో ఎంపీ చెప్పిందేంటీ

కాగా, మంగళవారం సంభాల్ లో ఎంపీ రెహ్మాన్ మీడియాతో మాట్లాడుతూ..భారత్‌ను బ్రిటీషర్లు ఆక్రమించినప్పుడు మనం స్వాతంత్ర్యం కోసం పోరాడాం. అలానే ఇప్పుడు తాలిబాన్లు కూడా తమ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మొదట రష్యాపై, నేడు అమెరికాపై వారు పోరాటం చేశారు. ఇది వారి స్వాతంత్ర్య ఉద్యమం. దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు అని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.

ఖండించిన బీజేపీ

రెహ్మాన్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు మరికొందరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్పీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..వారికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి తేడా ఏముందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రశ్నించారు .ఎస్పీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని ఈ సందర్భంగా కౌశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు.
వైరల్ వీడియోపై ఎంపీ వివరణ
అయితే తన వ్యాఖ్యల వీడియో వైరల్ అవడంపై రెహ్మాన్ స్పందిస్తూ..నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను తాలిబన్లను పొగడలేదు. నా వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి అనవసరంగా వాటిని ప్రచారం చేశారు. నేను ఈ దేశ పౌరుడిని తప్ప అప్ఘానిస్తాన్ పౌరుడిని కాదు. అప్ఘానిస్తాన్ లో ఏమైతే జరుగుతుందో అది వారి అంతర్గత విషయం. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను భారత ప్రభుత్వం మరియు దాని విధానాలకు మద్దుతుగా ఉన్నాను అని వివరణ ఇచ్చారు.