73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్…వార్తలను ఖండించిన సీరమ్ ఇనిస్టిట్యూట్

73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా (Serum Institute of India (SSI))స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితమని ప్రకటనల్లో వెల్లడించింది.
ఈ మేరకు ఆ సంస్థ 2020, ఆగస్టు 23వ తేదీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ వస్తుందని తెలుసుకున్న ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారు చేసి భవిష్యత్ అవసరాల కోసం దానిని నిల్వ చేయడానికి మాత్రమే ప్రభుత్వం తమకు అనుమతినిచ్చిందని తెలిపింది.
చేస్తున్న పరీక్షలన్నీ విజయవంతమైన తర్వాత…ప్రభుత్వం అవసరమైన అనుమతులిచ్చిన అనంతరం కొవిషీల్డ్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది.
ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందనే నిర్ధారణ తర్వాత..సీరమ్ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేస్తుందని తెలిపింది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల ఉత్పత్తి చేసి అమ్మేందుకు ఎన్ఐఐ బ్రిటన్ కు చెందిన ఫార్మ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది.
భారతదేశంతో పాటు 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు డోసులు సరఫర చేయనున్నట్లు SSI గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం మధ్యలో వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని గతంలోనే ఈ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.