బంగ్లాదేశ్‌లో హింస వేళ షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వకపోయి ఉంటే..: శశి థరూర్

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంపై భారత్..

బంగ్లాదేశ్‌లో హింస వేళ షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వకపోయి ఉంటే..: శశి థరూర్

Shashi Tharoor

Shashi Tharoor: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల వల్ల ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇచ్చినందుకు కేంద్రాన్ని ప్రశంసించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆమెకు భారత్ సాయం చేయకపోతే అది మన దేశానికే అవమానకరమని చెప్పారు.

మన మిత్రులతో మనం చెడుగా ప్రవర్తిస్తే ఇకపై ఎవరూ మనకు మిత్రులు కావాలని కోరుకోరని షేక్ హసీనా చెప్పారు. షేక్ హసీనా భారత్‌కు మిత్రురాలని తెలిపారు. మిత్రులు ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసే విషయంలో మరో ఆలోచనలేవీ పెట్టుకోవద్దని చెప్పారు. ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి, భద్రత కల్పించి భారత ప్రభుత్వం సరైన పని చేసిందని అన్నారు.

అలాగే, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి భారతదేశానికి కూడా మొదట ఆందోళన కలిగించదని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌తో ఆ దేశ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శశి థరూర్ తన అభిప్రాయాలు తెలిపారు. బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు కొనసాగించడానికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

మొదటి నుంచి మద్దతుగా భారత్
బంగ్లాదేశ్‌కు భారత్ మొదటి నుంచి మద్దతు తెలుపుతోందని, 1971 యుద్ధం సమయంలోనూ మద్దతు తెలిపామని అన్నారు. కొన్ని సార్లు బంగ్లాదేశ్‌లో భారత స్నేహపూర్వక ప్రభుత్వం లేకపోయినప్పటికీ మనం మాత్రం సత్సంబంధాలను కొనసాగించామని తెలిపారు. రాబోయే కాలంలోనూ ఈ బంధాన్ని కొనసాగించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండబోవని చెప్పారు.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శశి థరూర్ అన్నారు. తనకు వ్యక్తిగతంగా మహమ్మద్ యూనస్ తెలుసని తెలిపారు. ఆయన అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని, ఆయన జమాత్ ఇ ఇస్లామీ, పాకిస్థానీ ఐఎస్‌ఐతో సత్సంబంధాలు కొనసాగించడం కంటే అమెరికాతో సత్సంబంధాలకే కాస్త మొగ్గు చూపుతారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

Also Read: నామినేషన్ దాఖలు చేసిన బొత్స.. కూటమి అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు