నాలుగేళ్ల తర్వాత తమిళనాడుకు శశికళ

Shashikala return to Tamil Nadu after four years : అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత ఆప్తురాలు శశికళ నాలుగేళ్ల తర్వాత నేడు తమిళనాడు చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమెకు కరోనా సోకడంతో… బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఆమెకు ప్రస్తుతం కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండానే ఆమె శ్వాస తీసుకోగలుగుతున్నారని తెలిపిన వైద్యులు, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
శశికళ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేయాలని భావిస్తున్నామని, అయితే కొన్ని రోజుల పాటు ఆమె హోం క్వారంటైన్ పాటించాలని ఆమెకు చికిత్స అందించిన బెంగళూరు మెడికల్ కాలేజ్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్య బృందం తెలిపింది. జనవరి 20న శశికళ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమె బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యారు.
శశికళ విడుదల కావడంతో కర్ణాటక, తమిళనాడులోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి 15, 2017 నుంచి శశికళ జైలు జీవితం గడిపారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శశికళ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. అనారోగ్యం కారణంగా శశికళ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేలో శశికళ మద్దతుదారులను ఆ పార్టీ అధిష్టానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు.
శశికళ జైలు నుంచి విడుదల కావడంతో ఆమెకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు వేసిన తిరుచ్చి జిల్లా ముఖ్య నేత ఆర్ అన్నాదురైని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకే అతనిపై వేటు వేసినట్లు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అన్నాదురైతో పార్టీ సభ్యులెవరూ సంబంధాలను కొనసాగించవద్దని కూడా పేర్కొంది.
శశికళకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు వేసినందుకే ఇంత కఠినంగా వ్యవహరించిన అన్నాడీఎంకే అధిష్టానం ఆమెతో కలిసి నడిచేందుకు ఎంతవరకూ సుముఖంగా ఉందో ప్రశ్నార్థకమే. ఆసుపత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ కానుండటంతో ఆమె జైలు జీవితం ముగిశాక తొలిసారిగా తమిళనాడు గడ్డపై అడుగుపెట్టబోతున్నారు.