శుభాంశు శుక్లా భూమిపై జీవనశైలికి మళ్లీ అలవాటు పడుతున్నాడు: శుక్లా తండ్రి
"ఆయన భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు" అని అన్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)పై భారత పతాకాన్ని ఎగరవేసిన మన హీరో, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ISSపై అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుక్లా ప్రస్తుతం అమెరికాలోని హ్యూస్టన్‌లో తన కుటుంబంతో ఉన్నారు.
అంతరిక్షయానం ఎంత అద్భుతమో, భూమిపై మనవారిని తిరిగి కలుసుకోవడం కూడా అంతే అద్భుతం. అమెరికా నుంచి భారత్‌కు శుభాంశు శుక్లా త్వరలోనే రానున్నారు.
శుక్లా గురించి ఆయన తండ్రి శంభూ దయాల్ లక్నోలో మీడియాతో మాట్లాడుతూ… “శుభాంశు శుక్లా భూమిపై జీవనశైలికి మళ్లీ అలవాటు పడుతున్నారు. దేశం మొత్తం గర్విస్తోంది, మా వీధిలో కూడా పండుగ వాతావరణం నెలకొంది” అని తెలిపారు.
“శుభాంశు ప్రస్తుతం వైద్య నిపుణుల కేర్‌లో ఉన్నారు. భూమిపై జీవితానికి మళ్లీ అలవాటు పడేందుకు అది అవసరం. ఆయన భార్య, కుమారుడు కూడా అక్కడే ఉన్నారు” అని అన్నారు.
కాగా, తన ఆరేళ్ల కుమారుడు కియాష్‌ను గట్టిగా కౌగిలించుకున్న క్షణం ఎంతో భావోద్వేగంగా ఉందని శుక్లా ఇన్‌స్టాలో తెలిపారు. “ఇది నిజమైన హోంకమింగ్” అని ఆయన భార్య కామ్నా ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: TCSలో కొత్త టెన్షన్.. ’35 రోజుల బెంచ్ రూల్’పై ఉద్యోగ సంఘం ఫైర్.. అసలు వివాదం ఏంటి?
ఆరోగ్య పరిస్థితి
భూమికి చేరిన వెంటనే శుక్లాకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. హ్యూస్టన్‌లో ఒక వారం పాటు ప్రత్యేక పునరావాస ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. భూ వాతావరణానికి శరీరాన్ని తిరిగి అలవాటు చేయడానికి కార్డియోవాస్క్యులర్, మస్కులోస్కెలటల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తన 20 రోజుల మిషన్‌లో, శుక్ల 18 రోజులు ISS పై గడిపారు. భూమి చుట్టూ 320 సార్లు తిరిగి, 135 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ISRO, NASA రూపొందించిన కీలకమైన మైక్రోగ్రావిటీ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు.
యువతకు స్ఫూర్తి
శుక్లా విజయం ఇక్కడితో ఆగిపోలేదు. ఇది భారతదేశ ప్రతిష్ఠాత్మక “గగనయాన్” ప్రాజెక్టుకు (2027లో ప్రయోగం) ఒక బలమైన పునాది. శుక్లా చదివిన లక్నోలోని సిటీ మాంటిసోరి స్కూల్ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. “శుక్లా సార్ మాకు స్ఫూర్తి. నేను కూడా వ్యోమగామిని అవుతాను” అని ఆరోవ్ అనే విద్యార్థి చెప్పడం, యువతపై ఆయన ప్రభావాన్ని తెలియజేస్తోంది.