TCSలో కొత్త టెన్షన్.. ’35 రోజుల బెంచ్ రూల్’పై ఉద్యోగ సంఘం ఫైర్.. అసలు వివాదం ఏంటి?
అసలు ఏంటి ఈ కొత్త 'బెంచ్' పాలసీ? NITES ప్రధాన డిమాండ్లు ఏంటి?

Ratan Tatas TCS
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకువచ్చిన కొత్త “బెంచ్ పాలసీ” ఇప్పుడు ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) ఉద్యోగ సంఘం ఈ “బెంచ్ పాలసీ”పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
అసలు ఏంటి ఈ కొత్త ‘బెంచ్’ పాలసీ?
ఐటీ కంపెనీలలో ఒక ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత, మరో ప్రాజెక్ట్ కేటాయించే వరకు ఉద్యోగులు ఖాళీగా ఉండే సమయాన్ని “బెంచ్ పీరియడ్” అంటారు. TCS కొత్త పాలసీ ప్రకారం.. ఒక ఉద్యోగి ఏడాదిలో గరిష్ఠంగా 35 పనిదినాలు (business days) మాత్రమే బెంచ్‌పై ఉండాలి.
ఈ గడువు ముగిసిన తర్వాత ఉద్యోగుల భవిష్యత్తుపై కంపెనీ తీసుకునే చర్యల గురించి స్పష్టత లేకపోవడంతో, ఇది ఉద్యోగులను తొలగించేందుకు ఒక మార్గంగా మారుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఈ పాలసీ ఉద్యోగులలో భయాన్ని, అభద్రతను సృష్టిస్తోందని ఆరోపిస్తూ, NITES అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలుజా కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఉద్యోగుల వాదన ఇది
NITES అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలుజా మాట్లాడుతూ… “పైకి చూస్తే ఇది రీసోర్స్ ఆప్టిమైజేషన్ వ్యూహంలా (resource optimization strategy) కనిపించవచ్చు. కానీ దీని అసలు ఉద్దేశం, ప్రాజెక్టుల మధ్య ఖాళీగా ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెంచి, వారిలో భయాన్ని, అభద్రతను సృష్టించడమే” అని అన్నారు.
“ప్రాజెక్ట్‌లు లేని ఉద్యోగులు అంటే పనిచేయని వారని (non-performing) ముద్ర వేయడం తప్పు. వారు నైపుణ్యం కలిగిన నిపుణులు. క్లయింట్ డిమాండ్లు, ప్రాజెక్ట్ మార్పుల వల్లే వారు తాత్కాలికంగా బెంచ్‌పై ఉంటారు. అలాంటి వారిని బెదిరించడం అన్యాయం” అని చెప్పారు.
NITES ప్రధాన డిమాండ్లు ఇవే..
TCS తీసుకువచ్చిన ఈ 35 రోజుల బెంచ్ పాలసీని తక్షణమే నిలిపివేయాలని ఎన్‌ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది. ఐటీ కంపెనీలలో కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం, కంపెనీలు, ఉద్యోగ సంఘాలతో ఒక త్రికోణ కమిటీ (Tripartite Committee) ఏర్పాటు చేయాలని అంటోంది.
ఐటీ కంపెనీలు కార్మిక చట్టాలను కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో నిర్ధారించాలని చెబుతోంది. ఈ వివాదం ఐటీ రంగంలో కంపెనీల పాలసీలకు, ఉద్యోగుల హక్కులకు మధ్య ఉన్న బంధాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, TCS తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తుందో లేదో వేచి చూడాలి.