చదువుకున్నోళ్లే హింసను ప్రేరేపిస్తున్నారు

educated people ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం బెంగాల్ లోని బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వర్చువల్ ద్వారా పాల్గొన్న ప్రధాని… స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ప్రేరణాత్మకంగా, సంతోషంగా ఉందన్నారు. నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొనుంటే బాగుండేదని, కానీ కోవిడ్ వల్ల అక్కడికి రాలేకపోయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ… ఓ వైపు అనేకమంది విద్యావంతులు ప్రపంచవ్యాప్తంగా హింస,ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరోవైపు ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు కొంతమంది వారి జీవితాలనే పణంగా పెడుతున్నారన్నారు. ఇది ఐడియాలజీకి సంబంధించిన అంశం కాదు అని, ఇది మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశమని ప్రధాని తెలిపారు. మీరు ఏది చేసినా.. అది మీ మైండ్‌సెట్ పాజిటివ్‌గా ఉందా లేక నెగటివ్‌గా ఉందా అన్న అంశంపై ఆధారపడుతుందన్నారు.
అయితే ప్రతి ఒక్కరికీ ఆ రెండు అంశాలు ఎదురవుతుంటాయని, కానీ సమస్యను సృష్టించే వైపునకు వెళ్లాలో.. లేక సమస్యను పరిష్కరించే మార్గాన్ని ఎంచుకోవాలో విద్యార్థులు చేతిలోనే ఉందన్నారు. విజ్ఞానం, నైపుణ్యం విద్యార్థులను సమాజంలో తలెత్తుకునేలా చేస్తాయని…కానీ వాటిని చెడుకు వాడితే.. విద్యార్థులను చీకట్లోకి నెట్టేస్తాయన్నారు. జయాపజయాలు మన భవిష్యత్‌ను నిర్దేశించవు. మీ ఉద్దేశం సరైనదైతే పరిష్కారం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడొద్దు అని విద్యార్థులకు మోడీ సూచించారు.
ఇక, నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్‌లో కీలకమైన ముందడుగని ప్రధాని అన్నారు. ఈ విద్యావిధానం వల్ల విద్యార్థులను పరిశోధన, సృజనాత్మకతవైపు నడిపించేందుకు బలాన్ని చేకూర్చిందన్నారు. రైతులకు, చేతివృత్తి కళాకారులు ప్రపంచ మార్కెట్లలో రాణించేందుకు.. వారికి సహకరించాలని ఈ సందర్భంగా విశ్వభారతి విద్యాలయం విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించటంలో కీలకమన్నారు. ఈ వర్సిటీ కేవలం విద్యారంగానికే పరిమితం కావద్దని రవీంద్రనాధ్ ఠాగూర్ భావించారని.. భారత సంస్కృతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు