కేరళను తాకిన రుతుపవనాలు.. మరో రెండుమూడు రోజుల్లో ఏపీలోకి ఎంట్రీ.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈసారి రుతుపవనాలు అంచనాకంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16ఏళ్లలో ఇదే తొలిసారి.

కేరళను తాకిన రుతుపవనాలు.. మరో రెండుమూడు రోజుల్లో ఏపీలోకి ఎంట్రీ.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Updated On : May 26, 2025 / 4:05 PM IST

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు శనివారం ఉదయం కేరళ రాష్ట్రాన్ని తాకాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కేరళను తాకిన ఈ రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా.

ఈసారి రుతుపవనాలు అంచనాకంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే23వ తేదీనే కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి.

మరోవైపు.. అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలోసైతం ఈ నెల 27వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో నైరుతి రుతుపవనాల విస్తరణకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఏపీలో 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

ఏపీలో శుక్రవారం అల్లూరి జిల్లా, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాళ అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలుసహా.. నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.