మాల్యా మటాష్ : పారిపోయిన ఆర్థిక నేరగాడిగా డిక్లేర్

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 10:25 AM IST
మాల్యా మటాష్ : పారిపోయిన ఆర్థిక నేరగాడిగా డిక్లేర్

ముంబై: మాల్యా పాపం పండింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. లండన్‌లో ఉన్న మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’గా ముంబైలోని పీఎంఎల్‌ఏ స్పెషల్ కోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో మాల్యాకు సంబంధించి దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవడానికి లైన్ క్లియర్ అయ్యింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 కింద కోర్టు ప్రకటించిన తొలి పారిపోయిన ఆర్థిక నేరగాడు మాల్యానే. కోర్టు తీర్పుతో మాల్యాపై చర్యలు తీసుకోవడానికి అధికారులు రెడీ అవుతున్నారు.
ఎదురుదెబ్బ:
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడి గుర్తించాలని పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ గతంలో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ విచారించిన కోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పుఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు ఈడీ ప్రారంభించిన విచారణ ప్రక్రియపై స్టే విధించాలని మాల్యా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది.
జైలు రెడీ:
బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మాల్యా లండన్‌లో ఉంటున్నాడు. మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందిగా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు 2018 డిసెంబర్‌లో తీర్పుఇచ్చింది. మాల్యాపై తప్పుడు కేసులు పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేనందున భారత్‌లోని కోర్టులకు మాల్యా సమాధానం చెప్పాలని లండన్‌ కోర్టు జడ్జి తేల్చి చెప్పారు. మాల్యా కోసం ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలును సిద్ధం చేశారు. బ్రిటన్‌ నుంచి తీసుకొచ్చిన తర్వాత మాల్యాను అక్కడ ఉంచనున్నారు.