ఇండియా – పాక్ మధ్య అనిశ్చితి ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు ఢమాల్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..
మార్కెట్ల దెబ్బకు సుమారు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నెగిటివ్ లో స్పందించాయి. ఓపెనింగ్ సెషన్ లో సెన్సెక్స్ భారీగా పడిపోయింది. ఏకంగా 950కి పైగా పాయింట్లు పతనమైంది. మళ్లీ 80వేల మార్క్ కంటే కిందకు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా దారుణంగా నష్టపోయింది. 320కి పైగా పాయింట్లు పతనమైంది. దీంతో 24వేల మార్క్ ను కోల్పోయింది.
ఈక్రమంలో మదుపరులు భారీ ఎత్తున సంపదను కోల్పోయారు. మార్కెట్ల దెబ్బకు సుమారు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, అదానీ పవర్, సైయంట్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ అత్యంత భారీగా పతనమయ్యాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగినప్పటికీ కూడా భారత మార్కెట్లు పతనం కావడం గమనార్హం. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు వేచి చూస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా కొంత మేర నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు.