మోడీ బహుముఖ మేధావి : సుప్రీంకోర్టు జడ్జీ ప్రశంసలు

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దూరదృష్టి ఉన్న నేత, బహుముఖ మేధావి అంటూ కితాబిచ్చారు. 1500 చట్టాలను తొలగించడంపై ఆయన స్పందించారు. 2020, ఫిబ్రవరి 22వ తేదీన..అంతర్జాతీయ న్యాయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మిశ్రా ప్రసంగిస్తూ…జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు సాధారణమైనవని, దీనికి ముఖ్యమైన పాత్ర ఉందన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు ఉత్తేజకరంగా, సమావేశాలకు ఎజెండాను నిర్ణయించడానికి స్పూర్తిగా ఉంటాయన్నారు. సదస్సును ప్రారంభించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం..అతి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశం అని..ఇంత విజయవంతంగా ఎలా ముందుకెళుతుందోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వివరించారు. భారతదేశం రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నామని ఈ క్రమంలో..న్యాయవ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ వెన్నెముక అని, శాసనసభ హృదయం, కార్యనిర్వాహకుడు మెదడు..మూడు అవయవాలు స్వతంత్రంగా..సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఉన్నత న్యాయస్థానంలో సీనియార్టి విభాగంలో మిశ్రా మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశానికి 20 దేశాల న్యాయమూర్తులు హాజరవుతున్నారు.
Read More : మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్