NEET-Supreme Court : నీట్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అరెస్టైన విద్యార్థులకు భారీ ఊరట!
NEET-Supreme Court : నీట్-యూజీ 2026 పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా అరెస్టు అయిన 18 ఏళ్లలోపు విద్యార్థులను, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
NEET-Supreme Court
- నీట్ నిరసనలపై సుప్రీం సంచలన ఆదేశాలు.. అరెస్టైన విద్యార్థులకు ఊరట
- నేరచరిత్రలేని 18ఏళ్ల లోపు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి
- ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
NEET-Supreme Court : పరీక్షా పత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనగళం వినిపించారు. ఈ క్రమంలో పోలీసులు అనేక మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయా విద్యార్థులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది.
ముఖ్యంగా 18 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మైనర్ విద్యార్థులు, వారిలో ఎలాంటి నేరచరిత్ర లేకుండా ఆందోళనల సమయంలో ఫస్ట్ టైం అరెస్ట్ చేసి ఉంటే అలాంటివారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే, ఢిల్లీలోని జంతర్ మంతర్, ఇతర రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఈ విద్యార్థులపై దర్యాప్తునకు అనుమతించిన సుప్రీంకోర్టు వారిపై మాత్రం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఢిల్లీ, పలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు మితిమీరి బలప్రయోగం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం (జూలై 28) ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, నేరచరిత్ర ఉన్న వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదని సుప్రీం స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల హక్కులను పరిరక్షించడం అనేది ప్రజాస్వామ్యానికి అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
పేపర్ లీక్ నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
అంతేకాదు.. పోలీసు సిబ్బందిపై జరిగిన దాడుల ఆరోపణలను కూడా విచారణకు తీసుకుంటామని తెలిపింది. నేర చరిత్ర లేని అరెస్టు అయిన వ్యక్తులందరినీ విడుదల చేయాలని సూచించింది. నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ ఫుటేజ్, బాడీ-కెమెరా రికార్డింగ్లు, వైర్లెస్ కమ్యూనికేషన్లు, ఇతర అన్ని డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీతో పాటు అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో ఘర్షణలు, పలు రాష్ట్రాల్లో నిరసనల నేపథ్యంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారణకు అనుమతించింది.
స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారణ జరగాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
