SC to Delhi Govt: ప్రకటనలకు వందల కోట్లు.. అభివృద్ధికి లేవా? కేజ్రీవాల్ మీద మండిపడ్డ సుప్రీంకోర్టు
మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము

ర్యాపిడ్ రైలు ప్రాజెక్టుకు తన వాటా నిధులను కేజ్రీవాల్ ప్రభుత్వం అందించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ 3 సంవత్సరాలకు 1100 కోట్ల రూపాయలు ఉందని గుర్తు చేసిన ధర్మాసనం.. ముఖ్యమైన పనికి డబ్బు ఎందుకు లేదని ప్రశ్నించింది. వాస్తవానికి, ర్యాపిడ్ రైలును ‘ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ లేదా RRTS అని పిలుస్తారు. దీని ద్వారా ఢిల్లీని యూపీలోని మీరట్‌తో అనుసంధానం అవుతుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చెల్లించాలి.
రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము. అప్పటి వరకు చర్యలు తీసుకోకుంటే ఉత్తర్వులు అమలు చేస్తాం. నిధులు ఇవ్వకపోతే, ఢిల్లీ ప్రభుత్వం తన ప్రకటనల బడ్జెట్‌ను కోల్పోవాల్సి వస్తుంది’’ అని కోర్టు స్పష్టం చేసింది.
కఠిన ఉత్తర్వులు ఎందుకు జారీ చేశారు?
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో కూడా ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. జూలైలో జరిగిన విచారణలో ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తుందో ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తామని కోర్టు హెచ్చరించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం 2 వారాల్లోగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం చెల్లింపు చేయలేదని కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు.