Ambedkar Starue at SC: స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్లకు.. సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం

లాయర్ లాగా గౌను, బ్యాండ్ ధరించి, ఒక చేతిలో రాజ్యాంగం కాపీని కలిగి ఉన్న ప్రతిమను సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శిల్పి నరేష్ కుమావత్ తయారు చేశారు.

Ambedkar Starue at SC: స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్లకు.. సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం

Ambedkar Starue at SC: రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహేబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్‌కు ఉన్న ప్రాముఖ్యత కారణంగా ఆయనను ‘భారత రాజ్యాంగ పితామహుడు’ అని పిలుస్తారు. ఆయన విగ్రహాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు, రాజ్యాంగ సంస్థలలో ఏర్పాటు చేశారు. అంతే కాదు.. దేశంలో ప్రతి కూడలిలో ప్రతి వాడలో ప్రతి రోడ్డులో రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. సామాజిక న్యాయ యోధుడైన ఆయన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన దిక్సూచి ఆయన. తన చూపుడు వేలుతో సామాజిక న్యాయం, ప్రగతి వైపు పయనించమని ప్రజలకు స్ఫూర్తినిస్తాయి.

స్వాతంత్ర్యం వచ్చిన 76 ఏళ్లకు
అయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో బీఆర్ అంబేద్కర్ విగ్రహం లేదు. తొందరలో ఇది నిజం కాబోతోంది. త్వరలో సుప్రీంకోర్టు ఎదుట బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన తర్వాత సుప్రీంకోర్టు ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఈసారి రాజ్యాంగ దినోత్సవం కూడా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ చొరవతో, న్యాయనిపుణుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దీనిని ఆవిష్కరించనున్నారు.

మూడు అడుగుల ఎత్తు పునాదిపై ఏడు అడుగుల విగ్రహం
కాగా సుప్రీంకోర్టు ఆవరణలో మూడు అడుగుల ఎత్తైన పునాదిపై, న్యాయవాది వేషధారణలో ఏడు అడుగుల ఎత్తైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కానుంది. లాయర్ లాగా గౌను, బ్యాండ్ ధరించి, ఒక చేతిలో రాజ్యాంగం కాపీని కలిగి ఉన్న ప్రతిమను సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శిల్పి నరేష్ కుమావత్ తయారు చేశారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రాంగణంలో రెండు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒకటి భారత సంతతికి చెందిన బ్రిటిష్ శిల్పి చింతామణి కర్ చేత రూపొందించిన భారతమాత కుడ్యచిత్రం కాగా, మరొకటి బ్రిటిష్ శిల్పి రూపొందించిన మహాత్మా గాంధీ విగ్రహం. కాగా, బాబాసాహేబ్ విగ్రహాన్ని భారతీయ పౌర కళాకారుడు నరేష్ కుమావత్ రూపొందించారు.

రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రారంభం
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా న్యాయనిపుణుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆవిష్కరిస్తారు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం, హర్యానాలోని మనేసర్‌లో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సుప్రీంకోర్టుకు పంపనున్నారు. ఈ విగ్రహంలోని విశేషమేమిటంటే.. డా. అంబేద్కర్‌ న్యాయనిపుణునిగా, సరళమైన భాషలో న్యాయవాదిగా కనిపిస్తారు. బహుశా, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పాత్ర, అద్భుతమైన న్యాయనిపుణుడు కావడం వల్లే ఆయన విగ్రహానికి ఈ ఆకృతి వచ్చింది.