Tamil Nadu Polls: తమిళనాడు ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన విజయ్, రెండు చోట్ల నుంచి పోటీ, కారు డ్రైవర్ కొడుక్కి టికెట్
అభ్యర్థుల ఎంపికలో విజయ్ తనదైన మార్క్ చూపించారు. అత్యంత సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తన చిరకాల కార్ డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఆయన ఒక టిక్కెట్‌ను ప్రకటించారు.
Tamil Nadu Polls: తమిళనాడులో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. 2026 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు టీవీకే అధినేత విజయ్. 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్నారు విజయ్. తమిళనాడులోని పెరంబూరు (చెన్నై), తిరుచ్చి (తూర్పు) నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేయనున్నారు. అంతేకాదు తన కారు డ్రైవర్ కొడుక్కి తన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు విజయ్.
ఈసారి ఎన్నికలు టీవీకే వర్సెస్ డీఎంకేగా సాగుతాయని విజయ్ అన్నారు. టీవీకేని గెలిపిస్తే డ్రగ్ ఫ్రీ తమిళనాడుని చేస్తానని హామీ ఇచ్చారు విజయ్. నిరుద్యోగులకు 4వేల రూపాయల భృతి, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధ్యానత ఇస్తామన్నారు. యువతకు 20 లక్షలు ఉపాధి సాయంగా లోన్లు ఇచ్చేలా చూస్తామన్నారు. దీంతో పాటు తమిళనాడులో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు విజయ్.
అభ్యర్థుల ఎంపికలో విజయ్ తనదైన మార్క్ చూపించారు. అత్యంత సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తన చిరకాల కార్ డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు ఆయన ఒక టిక్కెట్‌ను ప్రకటించారు. దీంతో తండ్రీ, కొడుకులు భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రీకొడుకులు ఇద్దరూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోగా విజయ్ వారిని ఓదార్చారు. విజయ్ చేసిన పనిని కార్యకర్తలు మెచ్చుకున్నారు. తనకు అండగా నిలిచే వారిని ప్రోత్సహించాలన్న ఆయన సందేశానికి ఆ క్షణం ప్రతిబింబంగా నిలిచింది.
234 స్థానాలకు అభ్యర్థులు..
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ ‘తమిళగా వెట్రి కజగం’ను అధికారికంగా ఎన్నికల బరిలోకి దించారు. చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో ఆయన మొత్తం 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను పరిచయం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోకి తన పూర్తిస్థాయి ప్రవేశానికి సంకేతమిచ్చారు.
ఎన్నికల్లో పోటీకి సంబంధించి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఉత్తర, మధ్య తమిళనాడు అంతటా బలమైన ఉనికిని నెలకొల్పే లక్ష్యంతో చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల నుంచి తాను వ్యక్తిగతంగా పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ ఎన్నికలు తమ ప్రజా కూటమికి, ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని కూటమికి మధ్య ప్రత్యక్ష పోటీగా ఉంటాయని, ఇది ద్రవిడ మున్నేట్ర కజగంకు ప్రత్యక్ష సవాల్ గా నిలుస్తుందని విజయ్ స్పష్టం చేశారు.
అభ్యర్థుల జాబితాలో టి. నగర్ నుండి ఆనంద్, విల్లివక్కం నుండి అడవ్ అర్జున్, ఎగ్మోర్ నుండి రాజమోహన్ వంటి కీలక పేర్లు ఉన్నాయి. విజయ్ అభ్యర్థులందరినీ కేవలం ఎమ్మెల్యేలుగానే కాకుండా “ప్రజల సంరక్షకులు”గా అభివర్ణించారు. అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
అభ్యర్థుల ప్రకటన సందర్భంగా పలు కీలక హామీలను కూడా వెల్లడించారు విజయ్. డ్రగ్ ఫ్రీ తమిళనాడు, స్కూల్స్ కాలేజీల్లో మాదకద్రవ్య నిరోధక విభాగాలు, 12వ తరగతి నుండి పీహెచ్డీ వరకు ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు విద్యా రుణాలు, 29 ఏళ్లు పైబడిన పట్టభద్రులకు 4వేల, పాలిటెక్నిక్ విద్యార్థులకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటివి ఉన్నాయి.
అంతేకాకుండా ప్రైవేట్ సంస్థలలో స్థానికులకు ప్రోత్సాహకాలతో 75శాతం ఉద్యోగ అవకాశాలు, 5 లక్షల మంది యువతను లక్ష్యంగా చేసుకుని “ముఖ్యమంత్రి జనసేవ మిత్ర” పథకం ద్వారా గ్రామీణ ఉపాధి, ఏటా 5 లక్షల మంది పట్టభద్రులకు స్టైపెండ్లతో ఇంటర్న్‌షిప్ అవకాశాలు, నిజాయితీ గల పారిశ్రామికవేత్తలకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తామని టీవీకే హామీ ఇచ్చింది.
Also Read: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి మరిన్ని రూల్స్.. ఈ జాగ్రత్తలు పాటించండి
