కరుణానిధి సాంగ్‌ను కాపీ కొట్టిన బీజేపీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

కరుణానిధి సాంగ్‌ను కాపీ కొట్టిన బీజేపీ.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Tamil Nadu Bjp

Updated On : March 31, 2021 / 11:11 AM IST

తమిళనాడు రాష్ట్రంలో వేసవికాలంలో అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచగా.. హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే డీఎంకే కూటమి ఎన్నికల్లో పక్కాగా గెలుస్తుంది అని అంచనాలు వేస్తుండగా.. అన్నాడీఎంకేతో పొత్తు కట్టిన బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గబోము అన్నట్లుగా.. ప్రచారంలో దూసుకుని పోతుంది. ఈ క్రమంలోనే మార్చి 28వ తేదీన తమ ట్విట్టర్ ఖాతాలో బీజేపీ పోస్ట్ చేసిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఈ పాటను బీజేపీ దొంగిలించిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 2010లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ తమిళ సదస్సు జరిగింది. ఈ సదస్సు కోసం కరుణానిధి స్వయంగా సెమ్మోజి అనే పాటను రాశారు. ఆ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళనాడు కల్చర్, తమిళ భాష యొక్క గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పారు. ఈ పాటకు ప్రముఖ భరతనాట్యం డ్యాన్సర్, కాంగ్రెస్ ఎంపీ క్రాంతి చిదంబరం భార్య నాట్యం చేశారు. ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ అయింది.

ఇప్పుడు ఇదే పాటను తమ ప్రచారానికి వాడుకోవాలని భావించిన బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ పాటపై చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలేనని, వారిని తమిళ ప్రజలు నమ్మరని అంటున్నారు. ఎంపీ క్రాంతి చిదంబరం కూడా దీనిపై స్పందించారు. ప్రచారంలో బీజేపీ అబద్దాలను చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని చెప్పుకొచ్చారు.

ఈ పాటపై సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శలు రావడంతో పాటను డిలీట్ చేశారు. అయితే అప్పటికే కొందరు స్క్రీన్ షాట్స్ తీసుకోని ట్రోల్స్ చేస్తున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6 న ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.. వీటి ఫలితాలు మే 2న రానున్నాయి.