తమిళనాడు పోలీసుల నిర్వాకం.. కర్ణాటకకు వెళ్లి లాక్ డౌన్ ఉల్లంఘించారంటూ హోం మంత్రిని ఆపేశారు

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. కానీ, ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్‌డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగతి కూడా మర్చిపోయారు. కర్ణాటకకు వెళ్లి ఆ హోం మంత్రి కారును ఆపేశారు. మంత్రిని అని చెప్పినప్పటికీ ఐడీ కార్డు.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆరాలు తీశారు.
ఈ ఘటనకు కర్ణాటక హోం మంత్రి అవాక్కయ్యారు. వెంటనే ప్రాంతంలోని రూరల్ పోలీసులను పిలిపించారు. ఎస్పీ రవి డీ చన్నావర్ రాగానే తమిళనాడు పోలీసులు బోర్డర్ దాటి వచ్చిన తర్వాత విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టారంటూ బొమ్మాయ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఈ రోజు నేను నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లాను. పలు ప్రాంతాలు తిరిగిన అనంతరం.. తమిళనాడు పోలీసులు కర్ణాటక బోర్డర్లో బారికేడ్లు పెట్టి ఉండటం గమనించాను. బెంగళూరు పోలీసులను పిలిపించి బారికేడ్లు తీయించానని పోస్టు చేశారు. ఎస్పీ రవి.డి చన్నావర్ మాట్లాడుతూ..తమిళనాడు పోలీసులు కర్ణాటకలోకి వచ్చేసి బారికేడ్లు పెట్టారు. వాటిని మేం చెప్పిన వెంటనే తొలగించారని అని అన్నారు.
ఇన్‌స్పెక్షన్ సమయంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ లు ఉన్నారు. కర్ణాటక హోం మంత్రిని తమిళనాడు పోలీసులు ప్రశ్నించిన దానిపై వార్తల్లోకి వచ్చిన తర్వాత సర్దిచెప్పుకున్నారు. మినిస్టర్ కు సాయం చేసేందుకే మేం అక్కడికి వచ్చామని వివరణ ఇచ్చుకున్నారు. (రాష్ట్రంలో బయటకొస్తే మాస్కులు తప్పనిసరి)