Sabarimala Yatra on wheel chair : టీచర్‌ కోసం వీల్‌చైర్‌పై దివ్యాంగుడు శబరిమల యాత్ర..

తనకు ఎంతగానో సహాయం చేసిన టీచర్‌ కోసం వీల్‌చైర్‌పై శబరిమల యాత్ర చేపట్టాడు ఓ దివ్యాంగుడు.

Sabarimala Yatra on wheel chair : టీచర్‌ కోసం వీల్‌చైర్‌పై దివ్యాంగుడు శబరిమల యాత్ర..

disabled man off to Sabarimala on wheelchair

Updated On : December 22, 2022 / 12:56 PM IST

Sabarimala Yatra on wheel chair : అపకారం చేసినవారినైనా మర్చిపోవచ్చు గానీ ఉపకారం చేసినవారిని మర్చిపోకూడదని పెద్దలు చెబుతుంటారు. అదే చేశాడు తమిళనాడుకు చెందిన ఓ దివ్యాంగుడు. తను సొంతంగా ఓ ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం చేసిన టీచర్ కోసం వీల్ ఛైర్ పై శబరిగి యాత్రకు బయలుదేరాడు. తన సొంతింటి కలను సాకారం చేసిన ఉపాధ్యాయురాలు బాగుండాలంటూ ప్రార్థిస్తూ అతను శబరిగిరీశుడిని దర్శించుకోవాలనుకున్నాడు. తనకు సహాయం చేసిన టీచర్ సుఖ సంతోషాలతో జీవించాలని కోరేందుకు శబరిగిరి యత్రకు బయలుదేరాడు. అయ్యప్ప మాల ధరించి ఎంతో నియమ నిష్టలతో దీక్ష పూర్తి చేసుకుని అయ్యను దర్శించుకోవటానికి బయలుదేరాడు.

తమిళనాడులోని ముత్తుపేటకు చెందిన కన్నన్ అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలున్నారు. కన్నన్ కుటుంబాన్ని పోషించుకోవానికి భవన నిర్మాణ రంగంలో పనిచేసేవాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బులతో భార్యాపిల్లలతో సంతోషంగా జీవించేవాడు. కానీ రోజులన్నీ ఒకలా ఉండవు కదా..ఉన్నంతలో సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో రోడ్డు ప్రమాదం అతలాకుతలం చేసిపారేసింది. లారీ నుంచి భవన నిర్మాణ సామగ్రిని దింపే సమయంలో ప్రమాదానికి గురి అయ్యాడు. ఈ ప్రమాదంలో కన్నన్ కాలు పూర్తిగా దెబ్బతింది. దీంతో కాలు తీసేయాల్సివచ్చింది. పనిచేయలేని పరిస్థితి. దీంతో కుటుంబానికి కష్టాలు ముంచెత్తాయి.కానీ ఎలాగోలా సంపాదిస్తేనే గానీ బిడ్డల కడుపు నింపలేని దుస్థితుల్లో ఎడవన్నప్పర ప్రాంతంలో లాటరీ టిక్కెట్లు అమ్మటం ప్రారంభించాడు. అలా వచ్చే అరాకొరా డబ్బులతో జీవనం సాగిస్తుండేవాడు.

ఈ క్రమంలో దేవతలా కొండొట్టి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న ఎంపీ సమీరాతో పరిచయం అయ్యింది కన్నన్‌ కు. అతని దీనపరిస్థితిని కళ్లారా చూసిన సమీర అతనికి ఏదన్నా సహాయం చేయాలని అనుకుంది. నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లతో కలిసి తాడపరంబులో కన్నన్ కోసం రూ.8 లక్షలతో ఇంటిని నిర్మించింది. ఒక వీల్ చైర్ కూడా కొనిచ్చింది. ఆమె చేసిన సహాయానికి కన్నీటి ధన్యవాదాలు చెప్పాడు. అలా తనకు అంత గొప్ప సహాయం చేసిన టీచర్ సమీరా బాగుండాలని కోరుకుంటూ శబరిమల యాత్రకు బయలుదేరాడు కన్నన్.

అలా తమిళనాడునుంచి కొన్నాళ్ల క్రితం మలప్పురం చేరుకున్నాడు. అక్కడి నుంచి శబరిమల ఆయలం 300కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వీల్ చైర్ మీదనే వెళుతున్నాడు. ఈ నెలాఖరులోగా (డిసెంబర్ 2022) అయ్యప్ప సన్నిధానం చేరుకోవాలని ఆరాటపడుతున్నాడు. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక బస్సులో తిరిగి తమిళనాడుకు వెళతానని చెబుతున్నాడు కన్నన్‌. వీల్ చైర్ పై అతని చేస్తున్న శబరిమల యాత్ర ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.