Tamil Nadu rains : తమిళనాడులో భారీవర్షాలు.. వరద బీభత్సంతో అతలాకుతలం

తమిళనాడులో కురిసిన భారీవర్షాలు వరద బీభత్సాన్ని మిగిల్చాయి. భారీవర్షాలు, వరదల వల్ల తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు....

Tamil Nadu rains : తమిళనాడులో భారీవర్షాలు.. వరద బీభత్సంతో అతలాకుతలం

Tamil Nadu rains

Updated On : December 19, 2023 / 10:03 AM IST

Tamil Nadu rains : తమిళనాడులో కురిసిన భారీవర్షాలు వరద బీభత్సాన్ని మిగిల్చాయి. భారీవర్షాలు, వరదల వల్ల తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు. తూత్తుకుడి జిల్లాలో 800 మంది రైలు ప్రయాణికులు వరదల్లో చిక్కుకున్నారు. టుటికోరిన్ విమానాశ్రయంలో 8 విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేశారు. తిరునెల్వేలిలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం వరదనీటితో జలమయమైంది.

నదులను తలపిస్తున్న రోడ్లు

తిరునెల్వేలి, తూత్తుకుడితో సహా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలలోని గ్రామాలు, పట్టణాలు, రోడ్లు, హైవేలు సోమవారం రోజు కురిసిన భారీ వర్షాల కారణంగా నదులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించారు. తిరునెల్వేలి, టుటికోరిన్, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు.

అతి భారీవర్షాలు

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేయడానికి 425 మంది విపత్తు ప్రతిస్పందన బృందం సభ్యులను రప్పించారు. తూత్తుకుడి జిల్లాలోని కాయల్‌పట్టణంలో అత్యధికంగా 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. తూత్తుకుడి జిల్లాలోని ఆలయ పట్టణం తిరుచెందూర్‌లో కూడా 69 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. తిరునెల్వేలి జిల్లాలోని మంజోలై లో 55 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

పొంగి ప్రవహిస్తున్న నదులు

తెన్‌కాసి జిల్లాలోని గుండార్ డ్యామ్ వద్ద 51 సెంటిమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ తెలిపింది. ఇంత కుండపోత వర్షాలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్పారు. అతి భారీవర్షాలు కురవడంతో తమిళనాడులోని పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తమిళనాడులోని నాలుగు జలపాతాల్లో భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. నాలుగు జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా వరదనీటితో జనం అవస్థలు పడుతున్నారు.

ALSO READ : చైనాలో భారీ భూకంపం… 100 మందిపైగా మృతి 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నలుగురు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఈవీ వేలు, పి మూర్తి, ఆర్ఎస్ రాజకన్నప్పన్‌లను నియమించారు. రాష్ట్రంలో భారీవర్షాల పరిస్థితులను తెలియజేసేందుకు మంగళవారం నాడు తాను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. ఇటీవల మిగ్ జామ్ తుపాను ప్రభావంతో చెన్నైలో చేపడుతున్న సహాయక చర్యలకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు.