ఎక్కడ చూసినా వరదనీరే.. భారీ వర్షాలతో తల్లడిల్లిన తమిళనాడు

తమిళనాడు భారీ వర్షాలకు తల్లడిల్లుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

ఎక్కడ చూసినా వరదనీరే.. భారీ వర్షాలతో తల్లడిల్లిన తమిళనాడు

Tamil Nadu rains update

Updated On : December 19, 2023 / 6:26 PM IST

Tamil Nadu rains update: భారీవర్షాలకు తమిళనాడు చిగురుటాకులా వణుకుతోంది. గత యాభై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కొన్ని జిల్లాలను భయపెడుతున్నాయి. ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లలో జనం బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏడువేల మంది నిరాశ్రయులయ్యారు. 12 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోరారు.

భయం గుప్పిట్లో ప్రజలు
తమిళనాడు భారీ వర్షాలకు తల్లడిల్లుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తమిళనాడులో వర్షాలకు ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకసి జిల్లాల్లో దారుణమైన పరిస్థితులున్నాయి. కాలనీలు, రోడ్లు, బ్రిడ్జిలు అంతా.. ఎక్కడ చూసినా వరదనీరే నిండిపోయింది. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మోకాలు లోతు నీళ్లలోనే ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. కాలనీలన్నీ జలాశయాలను తలపిస్తున్నాయనంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దక్షిణ తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడిలో గత యాభై ఏళ్లలో ఎప్పుడూలేనంతగా వర్షం పడింది. గత రెండు రోజులుగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. కొన్ని జిల్లాల్లో ఏడాది వర్షపాతం ఒకేరోజులో కురిసిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అనడం అక్కడ ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది.

Also Read: తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లలో భక్తులు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ ప్లాన్!

స్టాలిన్‌ సమీక్ష.. ప్రధాని ఆరా
వర్షాలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమీక్ష చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా తమిళనాడులో వర్షాలపై ఆరాతీశారు. ప్రజల్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని, అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఇప్పటికే సహాయకచర్యలకోసం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు సీఎం స్టాలిన్‌. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వాయుసేన హెలికాప్టర్ల ద్వారా భారీ వర్షాలు కురిసిన జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టింది. దాదాపుగా 7 వేల 5వందల మంది ఇళ్లను వదిలి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 12 వేల మందిని రెస్క్యూ టీమ్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.