CM MK Stalin : సంక్రాంతికి ‘చెరకు గడ’లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
సంక్రాంతికి చెరకు గడలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

Stalin announces sugarcane in Pongal gift hamper
CM MK Stalin : సంక్రాంతి పండుగకు ఇచ్చే కానుకల్లో చెరుకు గడలు కూడా ఉచితంగా ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు ప్రజలకు అందించే కానుకల్లో ఆరు అడుగుల చెరుకు గడలను కూడా చేర్చింది సీఎం స్టాలిన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి (పొంగల్) పండుగ సందర్భంగా ప్రభుత్వం బియ్యం కార్డులు ఉన్నవారికి రూ. 1,000 నగదు, కిలో చక్కెర, పచ్చిబియ్యం, చెరకు గడలకు ఉచితంగా ఇవ్వనుంది.
ప్రజలకు పంపిణీ చేయటానికి పచ్చిబియ్యం, చక్కెరలను రేషన్ దుకాణాలకు తరలించారు. ఇప్పటి వరకు ఇచ్చే పొంగల్ కానుకల్లో చెరకు గడలను కూడా చేర్చింది ప్రభుత్వం. అలాగే పంపిణీ చేసే చెరుకు గడలు తాజాగా ఉండాలని స్పష్టంచేశారు సీఎం స్టాలిన్. దాని కోసం చెరకు గడలను ఏరోజు ఆరోజునే కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు. ఒకేసారి మొత్తం కొనుగోలు చేస్తే చెరకు వాడిపోయే అవకాశముందని, అందువల్ల ఎప్పటికప్పుడు చెరకు గడలు కొనుగోలు చేయాలని సూచించారు.ఈ పొంగల్ కానుకలను కేవలం తమిళనాడు ప్రజలకే కాకుండా శ్రీలంక పునారావాస శిబిరాల్లో నివసించేవారికి కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు.
కాగా రాష్ట్రలో చెరుకు రైతులు ప్రభుత్వమే చెరుకు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇటు రైతుల వద్ద నుంచి చెరుకు కొని అటు ప్రజలకు సంక్రాంతి కానుకగా చెరుకు గడలను పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రెండువిధాలుగా ఉపయోగపడటానికి సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఈ ఏడాది పొంగల్ కానుకలో చెరుకు గడలను కూడా చేర్చింది. పొంగల్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్ జనవరి 9న ప్రారంభించనున్నారు.
పొంగల్ కానుకల పంపిణి సందర్భంగా రేషన్ దుకాణాలవద్ద రద్దీ అరికట్టేందుకు రోజుకు 200 నుంచి 250 రేషన్‌కార్డుదారులకు మాత్రమే ఉచిత ప్యాక్ అందించనుండగా, అందుకు సంబంధించిన రోజు, టైము వంటి వివరాలతో కూడిన టోకెన్లు జనవరి 4 నుంచి రేషన్ సిబ్బంది ఇళ్లకే వెళ్లి అందజేయనున్నారని సహకార శాఖ మంత్రి కేఈర్ పెరియకరుప్పన్ తెలిపారు.