భారీ వర్షాలతో స్కూళ్లు, కాలేజీలు మూసివేత

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవలు ఇచ్చారు. మద్రాస్ విశ్వవిద్యాలయం కూడా శుక్రవారం జరగాల్సిన పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీని తరువాత ప్రకటిస్తారు.
మూడు జిల్లాల్లోనూ పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. కాట్పాడిలోని సెర్కాడులోని తిరువల్లూవర్ విశ్వవిద్యాలయం కూడా గురువారం జరగాల్సి ఉన్న పరీక్షలను రద్దు చేసింది. గురువారం రద్దు చేసిన పరీక్షలు డిసెంబర్ 3 న జరుగుతాయి.
తమిళనాడులోని వివిధ జిల్లాల్లో శుక్రవారం ఉరుములు మెరుపులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖహెచ్చరించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నైలోని మీనాంబాక్కం లో 45 మి.మీ వర్షం, నుంగంబాక్కంలో 22 మి.మీ వర్షం కురిసింది.