Vizag steel plant: విశాఖ ఉక్కుపై టాటాకు ఇంత మక్కువ ఎందుకో?
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ప్రైవేటీకరణకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదు.

Vizag Steel Plant
Vizag steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ప్రైవేటీకరణకు కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (RINL)లో 100 శాతం వాటాలను ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన దగ్గర నుండి దీనిపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్నా కేంద్రం మాత్రం తాము అమలు చేయాలనుకున్న సంస్కరణలలో భాగం అడుగు ముందుకేసేందుకే సిద్దమవుతుంది.
అయితే.. ప్రైవేటీకరణ కానున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని దక్కించుకునేందుకు పలు స్వదేశీ కంపెనీలు కూడా ఆసక్తిగా ఉండగా టాటా టాటా కంపెనీ కూడా సిద్ధంగా ఉందని ప్రకటించింది. దేశీయ ఉక్కు దిగ్గజంగా పేరున్న టాటా స్టీల్.. వైజాగ్ స్టీల్ ను దక్కించుకునేందుకు సిద్దమవుతుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. విశాఖ ఉక్కుపై టాటా ఇంత మక్కువకు పలు కారణనున్నాయి.
తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వైజాగ్ స్టీల్‌ను టాటా దక్కించుకోగలిగితే ఆగ్నేయాసియా మార్కెట్లలో వ్యాపారం మరింత సులువు కానుండగా.. దేశీయ మార్కెట్లోనూ రైలు, రోడ్డు మార్గాల్లో ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అవకాశం లభించనుంది. 22 వేల ఎకరాల భూములున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వల్ప దూరంలోనే గంగవరం పోర్టు ఉండటం మరో అనుకూల అంశం కాగా తద్వారా బొగ్గు తదితర ముడిసరుకుల దిగుమతి, స్టీల్ ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభమవుతుంది. కోల్ కతా కేంద్రంగా వ్యాపారాన్ని సాగిస్తున్న టాటా స్టీల్ కు దక్షణాదిలో విశాఖ లాంటి ప్లాంట్ దక్కితే అది సంస్థకు తిరుగులేని వ్యాపార అవకాశంగా భావిస్తుంది.