Taxi Associations : క్యాబ్‌‌లో వెళుతున్నారా ? ఏసీ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే!

పెట్రోల్‌ ధరల పెరుగుదలతో క్యాబ్‌ డ్రైవర్స్ అసోసియేషన్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్‌ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు...

Taxi Associations : క్యాబ్‌‌లో వెళుతున్నారా ? ఏసీ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే!

CAB

Updated On : March 28, 2022 / 4:08 PM IST

Taxi Associations AC : ప్రైవేటు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, ఇతరులు క్యాబ్ లను ఆశ్రయిస్తుంటారు. వెళ్లే సమయంలో ఏసీ ఆన్ చేయమని చెప్పి.. హాయిగా వెళుతుంటారు. ప్రస్తుత ఎండకాలం కావడంతో ఏసీలు ఆన్ చేయమని కోరుతుంటారు కస్టమర్లు. ఓ మహిళ ప్రతి రోజు క్యాబ్ లో వెళుతుండేంది. అలాగే.. క్యాబ్ బుక్ చేసుకుని కార్యాలయానికి వెళ్లింది. ఎప్పటిలాగానే డ్రైవర్ ఏసీ ఆన్ చేయాలని కోరింది. 30 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. వసూలు చేస్తున్న ధరల్లో ఇప్పుడు ఎయిర్ కండీషనింగ్ చార్జీలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇది నా నిర్ణయం కాదు.. మా అసోసియేషన్ నిర్ణయమని చెప్పాడు. సాధారణంగా రూ. 180-200 చెల్లించే ఆమె.. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గమ్యస్థానానికి చేరుకొనే సరికి రూ. 350 ఇవ్వాల్సి ఇచ్చింది.

Read More : రోడ్డున పడుతున్నారు : Ola Cabs బ్యాడ్ న్యూస్

పెట్రోల్‌ ధరల పెరుగుదలతో క్యాబ్‌ డ్రైవర్స్ అసోసియేషన్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్‌ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. వాహనాల్లో ఏసీ ఆన్‌ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఏర్పాటు చేశారు క్యాబ్‌ డ్రైవర్లు. ఏసీ ఆన్‌ చేసినందుకుగాను 50 నుంచి వంద రూపాయల మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటున్నారు. ఇంధన ధరల పెంపుతో క్యాబ్‌ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. ఏసీ ఆన్ చేయడంతో కారు మైలేజ్‌ సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర తేడా వస్తుందని క్యాబ్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఏసీని ఆన్‌ చేస్తే క్యాబ్‌ అగ్రిగేటర్లకు కమిషన్‌ ఇవ్వడం అసాధ్యమని యూనియన్‌ పేర్కొంది. క్యాబ్‌ ప్రయాణికులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తోన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుత క్యాబ్‌ ఛార్జీలపై రవాణా శాఖ జోక్యం చేసుకోవాలని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్‌ యూనియన్‌ కోరింది.