అడవిలో రాయి కింద రక్తపు మడుగులో కనపడ్డ శిశువు.. కన్నీరు తెప్పిస్తున్న మూడు రోజుల పసికందు కథ
ఆ శిశువు ఇంకా జీవించి ఉండడం అద్భుతమేనని పిల్లల వైద్యుడు అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాత్రంతా బతకడం సాధారణంగా అసాధ్యం అని చెప్పారు.

Madhya Pradesh: ఆ శిశువు పుట్టి మూడు రోజులు మాత్రమే అవుతోంది. ఆ పడిగుడ్డు చల్లని అడవి నేలపై పడి ఉన్నాడు. ఆ శిశువు చర్మంపై చీమలు పాకాయి. పాలు తాగించాల్సిన అమ్మ, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నాన్న ఎవరూ అతడి వద్ద లేరు. ఇది మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో ఓ పసికందు కథ.
ఆ శిశువు రాత్రంతా చలిలో వణికి, పురుగుల కాటుకు గురై, సరిగ్గా ఊపిరాడక మరణం చివరి అంచుకు చేరే స్థితికి చేరుకున్నాడు. నిశ్శబ్దంగా ఉండే అడవిలో అతడి ఏడుపు వినపడింది. స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా, ఓ రాయి, దాని కింద ఆ రక్తంతో తడిసిన శరీరంతో ఆ శిశువు కనపడ్డాడు. ఆ శిశువును కాపాడిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరిపిన పోలీసులు వివరాలు తెలిపారు.
పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఉద్యోగం పోతుందని..
ఆ శిశువు తండ్రి పేరు బబ్లు డాండోలియా. అతడు ప్రభుత్వ టీచర్. ఆ శిశువు తల్లి పేరు రాజకుమారి డాండోలియా. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకారం ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువమంది ఉంటే ఉద్యోగాన్ని కోల్పోతామన్న భయం కొన్ని నెలల నుంచి ఆ దంపతులను వెంటాడింది. అప్పటికే వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
నాలుగో బిడ్డ గర్భంలో ఉంది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. సెప్టెంబర్ 23 తెల్లవారుజామున రాజకుమారి ఇంట్లో ప్రసవించింది. కొన్ని గంటలకే శిశువును నందనవాడి గ్రామానికి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి రాయి కింద వదిలేశారు ఆ దంపతులు.
స్థానికులు ఉదయం వేళ శిశువు ఏడుపుని విన్నారు. దగ్గరగా వెళ్లి చూశాక ఆ శిశువు చేతులు రాయి కింద కదులుతూ కనపడ్డాయి. ఆ శిశువును ఆసుపత్రిలో చేర్పించారు. ఛింద్వారా జిల్లా ఆసుపత్రి వైద్యులు శిశువుకు వైద్యం చేశారు. చీమల కాట్లతో పాటు హైపోథెర్మియా లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.
ఆ శిశువు ఇంకా జీవించి ఉండడం అద్భుతమేనని పిల్లల వైద్యుడు అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాత్రంతా బతకడం సాధారణంగా అసాధ్యం అని చెప్పారు. ప్రస్తుతం పసికందు సురక్షితంగా వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 93 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.