Air India Plane Crash: ఎయిరిండియా ప్లేన్ క్రాష్ వీడియోను తీసింది ఈ కుర్రాడే.. ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు.. ఎందుకంటే..
ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లటం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ వినలేదు. నా స్నేహితులకు చూపించాలని ఆ వీడియో తీశాను.

Air India Plane Crash: ఘోర ప్రమాదానికి లోనై పెను విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానాన్ని గాల్లో ఎగురుతుండగా ఆర్యన్ ఓ టీనేజర్ వీడియో తీశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోని తీసిన ఆర్యన్ ఎంతో డిస్ట్రబ్ అయినట్లుగా తెలుస్తోంది. ఎయిరిండియా విమానం ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుండటంతో వీడియో తీశానని, ఆ తర్వాత ఆ ప్లేన్ పేలిపోవడంతో చాలా భయపడినట్లు చెబుతున్నాడు.
అంతేకాదు ఇక జీవితంలో విమానం ఎక్కనంటూ కూడా బెంబేలెత్తినట్లు ఆర్యన్ స్నేహితులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆర్యన్ తీసిన వీడియోలో ఎయిరిండియా విమానం చాలా కిందగా ఎగరడం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఫ్లైట్ తాలూకా ప్లాప్స్ కూడా తేడాగా ఉండటం గమనించవచ్చు.
విమానం బాగా కింద నుంచి వెళ్తుండటంతో స్నేహితులకు చూపించేందుకే తన ఫోన్ లో రికార్డ్ చేశానని ఆర్యన్ చెబుతున్నాడు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కి సమీపంలోని లక్ష్మీనగర్ లో ఆర్యన్ కుటుంబం నివాసం ఉంటుంది. తన ఇంటిపై తాను ఉన్న సమయంలోనే ఎయిరిండియా డ్రీమ్ లైనర్ 787-8 విమానం గాల్లో తూలుతూ పెద్ద మంటలతో కూలిపోవడం అతడు రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ప్రమాద ఘటన దర్యాఫ్తులో కీలక ఆధారంగా మారింది.
Also Read: అధిక లాభాల పేరుతో సోదరుల ఘరానా మోసం.. 70వేల మంది నుంచి 2వేల 700 కోట్లు వసూలు..
శనివారమే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు ఆర్యన్. ”ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లటం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ వినలేదు. నా స్నేహితులకు చూపించాలని ఆ వీడియో తీశాను. కానీ అది ప్రమాద దృశ్యం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. విమానం గాల్లో తూలటం, తర్వాత పెద్ద శబ్దంతో మంటల్లో చిక్కుకోవడం చూసి నాకు చాలా భయమేసింది” అని చెప్పాడు ఆర్యన్.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్యన్ సరిగా నిద్రపోవటం లేదని అతడి కుటుంబసభ్యులు వాపోయారు. అంతేకాదు పదే పదే పలు మీడియా ఛానల్స్ నుంచి ఫోన్లు రావడం కూడా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తర్వాత ఒక్క ఆర్యన్ మాత్రమే కాదు మొత్తం లక్ష్మీనగర్ వాసులు కూడా భయాందోళన చెందుతున్నట్లు చెప్పారు.